Telugu Gateway
Andhra Pradesh

టీడీపీ లో హాట్ టాపిక్ గా మారిన వ్యవహారం !

టీడీపీ లో హాట్ టాపిక్ గా మారిన వ్యవహారం !
X

వైసీపీ హయాంలో సీనియర్ ఐపీఎస్ అధికారి ఏ బీ వెంకటేశ్వర రావు ఎన్ని సవాళ్లు ఎదుర్కొన్నారో అందరికి తెలిసిందే. అయన గత ప్రభుత్వంపై సుప్రీం కోర్టు తో పాటు వివిధ కోర్టు ల్లో కూడా పోరాటం చేయాల్సి వచ్చింది తన పోస్టింగ్ కోసం. జగన్ సర్కారు పలు మార్లు కోర్టు ఆదేశాలను కూడా పక్కన పెట్టి ఆయన్ను వేధించింది. ఎట్టకేలకు కొద్ది రోజుల క్రితమే కూటమి సర్కారు ఆయన సస్పెన్షన్ కాలాన్ని రెగ్యులర్ చేసి..ఆయనకు ప్రభుత్వం నుంచి అందాల్సిన అన్ని బెనిఫిట్స్ అందించే ఏర్పాట్లు అయితే చేసింది.

తాజాగా ఏ బీ వెంకటేశ్వర్ రావు ను ఏపీ పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇప్పుడు ఆయన ఈ పదవి తీసుకుంటారా లేదా అన్నది అందరిలో ఆసక్తిగా మారింది. టీడీపీ హయాంలో పనిచేసినందుకు, సామాజిక కోణంలో ఆయన్ను వైసీపీ వేధింపులకు గురి చేస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనకు చేయాల్సిన న్యాయం చేయలేదు అనే విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఇప్పుడు ఆయనకు నామినేటెడ్ పోస్ట్ ఇచ్చారు. దీనిపై కూడా సోషల్ మీడియా వేదికగా చాలా మంది విమర్శలు చేస్తున్నారు. మరి కొంత మంది ఇంతకంటే ఏమి చేయాలి అని చంద్రబాబు నిర్ణయాన్ని సమర్ధించే వాళ్ళు ఉన్నారు.

ఇదే అంశంపై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్

నారా చంద్రబాబునాయుడు , నారా లోకేష్ లకు నమస్కారం…🙏

ఏబీ వెంకటేశ్వరరావు గారికి పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చి ఎందుకు అలా అవమానించడం? మీరు ఆ పదవి ఆయనకు ఇవ్వకపోతే మాత్రం మిమ్మల్ని ఆయనగాని ఇంకా ఎవరుగాని ఏమి చేయగలరు?. మీకు ఇంకో నాలుగేళ్లు తిరుగులేదు, ఈ నాలుగేళ్లు ఇలాగే ఇప్పటిలాగే మీ ఇష్టమొచ్చినట్టు చేసుకోవచ్చు, మిమ్మల్ని అడిగేవారు ఎవరున్నారు గనుక?. మిమ్మల్ని ఆయనేమీ ఆ పదవి ఇవ్వమని ప్రాధేయపడలేదు కదా? పైరవీలు చేసుకోలేదు కదా?. మీరు ఆయనకు ఇచ్చే పదవి అదేనని, మీరు ఆయనను ఆ రకంగా అవమానిస్తారని మాకు అయిదారు నెలలుగా తెలుసు, మాకు ఒక అంచనా ఉంది. ఎందుకంటే…. మీరేమిటో మాకు నలభై ఏళ్లుగా తెలుసు కాబట్టి.! దివ్యదృష్టి దూరదృష్టి కలిగిన విజనరీగా మీరు ఆ పోస్టును ఇంకెవరికైనా వైసీపీ నుండి తెలుగుదేశంపార్టీలో చేరిన తులసిబాబు లాంటి వాళ్లకు, మిత్ర పక్ష పార్టీ నాయకులూ సోమూ వీర్రాజు విష్ణువర్ధన్ రెడ్డి లాంటివారికి ఇచ్చుకోండి. లేదంటే, మీరు గొప్ప త్యాగమూర్తులు నిజాయితీపరులు అని నిరూపించుకోవడానికి ఎవరైనా బాగా ధనవంతులైన తెలుగుదేశంపార్టీ నాయకులకు కార్యకర్తలకు సానుభూతిపరులకు విరాళ దాతలకు ఇచ్చుకోండి.

మిమ్మల్ని ఎవరూ ఏమీ అనుకోరు, మిమ్మల్ని ఏమీ అనుకోవాల్సిన అవసరంగానీ, పనిగానీ ఎవరికీ లేదు. కాకపోతే మీకు ఓ చిన్న విన్నపము మనవి..🙏 దయచేసి మనుషుల ఎమోషన్స్ తో సెంటిమెంట్స్ తో ఆడుకోవడానికి ప్రయత్నం చేయకండి, ఎందుకంటే….. మనిషికి అన్నిరోజులు అన్నిపరిస్థితులు అన్నీ ఒకేతీరుగా ఉండవు కదా, అది మీకు కూడా తెలుసు, మీ ఆటలు బెడిసికొడితే మాత్రం, ఆత్మాభిమానం పౌరుషం తెలివితేటలు కలిగి అలా అవమానాలకు గురైనవాళ్ళు మౌనంగా కొట్టే దెబ్బ సామాన్యంగా ఉండదు, బాగా గట్టిగా ఉంటుంది. అందునా పాత తొమ్మిది కోస్తాజిల్లా వాళ్ళు పైకి ఎంత సాధుజీవులుగా ఉంటారో, ఒకవేళ అవమానానికి గురైతే మాత్రం అంతే పద్ధతిలో వాళ్ళు చేయాల్సింది చేస్తారు. గత ఎనిమిది నెలలుగా మీరు సరిదిద్దుకోలేనంతగా సరికానంతగా మీపార్టీలో చాలామందికి చాలావర్గాలకు దూరమయ్యారు, దాన్ని సరిచేయడం ఎవరి తరమూకాదు. మీరు గాలిమేడల్లో ఊహాలోకాల్లో విహరిస్తున్నారు, గత అయిదేళ్లుగా చాలామంది మీ మీద పెట్టుకున్న ఆశలన్నీ ఇప్పుడు వాళ్లు వదిలేసుకున్నారు, మీమీద ఎవరికీ ఎలాంటి భ్రమలులేవు. మీపని మీరు చేసుకుంటూపోతున్నారు, వాస్తవాలు బోధపడినవాళ్లు అవమానాలకు నిరాదరణకు అన్యాయానికి గురౌతున్నవారు వాళ్ళపని వాళ్ళు చేసుకుంటూపోతున్నారు. ఎవరిపని వాళ్లది కదా! కాలమే సమాధానం.!

-సువేరా

Next Story
Share it