నిబంధనల మేరకే స్పందించా

ఏపీ సర్కారు జారీ చేసిన షోకాజ్ నోటీసుకు సీనియర్ ఐపీఎస్ అధికారి ఏ బీ వెంకటేశ్వరరావు సమాధానం ఇచ్చారు. అంతా నిబంధనల ప్రకారమే అని..ఎక్కడా సర్వీస్ రూల్స్ ఉల్లంఘించలేదని తన వివరణలో తెలిపారు. వ్యక్తిగత దూషణలు, ఆరోపణలపై స్పందించే అవకాశం ఆలిండియా సర్వీస్ రూల్స్ కల్పించాయన్నారు. తనకు ఇచ్చిన నోటీసులోనే పేర్కొన్న.. రూల్ 17 నియమానికి అనుగుణంగానే తాను మీడియాతో మాట్లాడినట్లు ఏబీ తెలిపారు. తాను ఇంటలిజెన్స్ చీఫ్‌గా ఉండగా పెగాసస్ సాఫ్ట్ వేర్ వినియోగించలేదని మాత్రమే చెప్పానని ఆ లేఖలో వివరించారు. ఆలిండియా సర్వీస్ రూల్స్ 6 ప్రకారం అధికారిక అంశాలపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉందన్నారు.
ప్రభుత్వ నిర్ణయాలను విమర్శించకూడదని మాత్రమే రూల్స్ చెపుతున్నాయన్నారు. మీడియా సమావేశంలో ప్రభుత్వాన్ని ఎక్కడా విమర్శించలేదని స్పష్టం చేశారు. గౌరవానికి భంగం కలిగించేలా తనపై, తన కుటుంబంపై ఆరోపణలు చేస్తే స్పందించకుండా ఎలా ఉంటానన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం లభించిన ప్రాధమిక హక్కు మేరకు వ్యక్తిగత ఆరోపణలపై వివరణ ఇచ్చానని స్పష్టం చేశారు. మీడియా సమావేశం పెడుతున్న విషయాన్ని ముందుగానే ప్రభుత్వానికి తెలిపానని, విజయసాయిరెడ్డి తనపై చేసిన ట్వీట్‌ను కూడా వివరణలో పేర్కొన్నట్లు ఏబీ వెంకటేశ్వరరావు తెలిపారు.