పెగాసెస్ కొనలేదు
ఏపీ సర్కారు 2019 మే వరకూ పెగాసెస్ కొనలేదని మాజీ ఇంటెలిజెన్స్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. ఆ తర్వాత ఏమి జరిగిందో తనకు తెలియదన్నారు. ఆయన సోమవారం నాడు విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించిన తనపై వచ్చిన ఆరోపణలకు వివరణ ఇచ్చారు. పెగాసెస్‌ను కొనలేదని డీజీపీ కార్యాలయమే చెప్పిందని గుర్తుచేశారు. పెగాసెస్ వల్ల ప్రజల్లో అభద్రతా భావం కలుగుతోందని పేర్కొన్నారు. ప్రజల భయాన్ని పోగొట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ఆయన స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో నిఘా చీఫ్‌గా ఉన్నందున తనకు పూర్తి సమాచారం ఉందని, మే 2019 వరకు ఏ ప్రభుత్వ సంస్థ పెగాసెస్ కొనలేదని తెలిపారు.
లేనిపోని అపోహలతో ప్రజల్లో భయాందోళన కలిగించవద్దని సూచించారు. కొందరు కోడిగుడ్డుపై ఈకలు పీకుతున్నారని ఏబీ వెంకటేశ్వరరావు ఎద్దేవాచేశారు. గత ప్రభుత్వ హయాంలో ఎవరి ఫోన్లు ట్యాప్ కాలేదని తెలిపారు. తనపై అనేక ఆరోపణలు చేశారని, సీఎస్ ఆఫీస్‌కు మూడు వినతిప్రతాలు ఇచ్చానని చెప్పారు. తనపై విచారణ త్వరగా ముగించి తుది నిర్ణయం తీసుకోవాలని కోరానని పేర్కొన్నారు. ఏపీ నుంచి కొన్ని పత్రాలు రాలేదని కేంద్రం చెబుతోందన్నారు. తన సస్పెన్షన్ విషయం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉందని వెంకటేశ్వరరావు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ ఎక్కడా కొనని..ఉపయోగించని దాన్ని తీసుకొచ్చి తనతో ముడిపెట్టడం సరికాదన్నారు.