Telugu Gateway
Andhra Pradesh

ఇక్కడా..అక్కడా అదే సీన్

ఇక్కడా..అక్కడా అదే సీన్
X

తెలంగాణ సచివాలయాన్ని నిర్మించటానికి తొలుత అంచనా వేసిన వ్యయం ఆరు వందల కోట్లు. తర్వాత అది పెరిగిపోయింది. ఎంతకు పెరిగిందో ఇంకా అసలు లెక్కలు బయటకు రాలేదు. ఇది తెలంగాణ రాష్ట్రంలో సాగిన వ్యవహారం. ఇది ఇలా ఉంటే ఆంధ్ర ప్రదేశ్ లో వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కోసం వైజాగ్ లో నిర్మించిన క్యాంపు ఆఫీస్ వ్యయం ఏకంగా 433 కోట్ల రూపాయలు. అక్కడ కూడా అదే సీన్. తొలుత ఇక్కడ పనుల కోసం 350 కోట్ల రూపాయలు కేటాయించగా...ఇప్పుడు ఆ ఖర్చు 433 కోట్లకు చేరింది. ఇది అక్కడితో ఆగుతుందా లేక..ఇంకా పెరుగుతుందా అన్నది పనులు అన్ని పూర్తి అయితే కానీ తేలదు. తొలుత వైజాగ్ లోని రుషికొండ పై నిర్మిస్తున్నది పర్యాటక శాఖ భవనాలు...పర్యాటక శాఖ కోసమే అని చివరి వరకూ చెప్పుకుంటూ వచ్చారు. కానీ నిర్మాణాలు తుది దశకు చేరుకున్న తర్వాత సీఎం క్యాంపు ఆఫీస్ కు ఈ భవనాలే సెట్ అవుతాయి అని ప్రభుత్వం నియమించిన కమిటీ నివేదిక ఇచ్చింది. ఇది అంతా పక్కా ప్లాన్ ప్రకారమే జరిగినట్లు అక్కడ జరిగిన పరిణామాలు చూస్తే స్పష్టం అవుతుంది. మొదటి నుంచి కూడా రుషికొండ లో చేపట్టిన నిర్మాణాలు సీఎం జగన్ కోసమే అని ప్రచారం జరిగింది. అయితే వాటిని ఎప్పటికప్పుడు తోసిపుచ్చుకుంటూ వచ్చారు. కానీ నిర్మాణాలు పూర్తి అయిన తర్వాత అసలు విషయం బయటకు వచ్చింది.

మొత్తం నాలుగు బ్లాక్ లుగా ఈ నిర్మాణాలు చేపట్టారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం హై కోర్ట్ ఆదేశాల మేరకు జీఓ లను ఆన్ లైన్ లో పెట్టడంతో రుషికొండ నిర్మాణాలకు సంబదించిన అసలు ఖర్చు వివరాలు బయటకు వచ్చాయి. ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ నిధులను దుబారా చేస్తున్నారు అని విమర్శించిన జగన్..ఇప్పుడు సీఎం క్యాంపు ఆఫీస్ ల కోసం ఏకంగా 433 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టడాన్ని ఎలా సమర్ధించుకుంటారు. ఐదేళ్లు రాజధాని అంశాన్ని పూర్తిగా పక్కన పెట్టిన సీఎం జగన్ మరి క్యాంపు ఆఫీస్ కే ఇంత ఖర్చు పెట్టిస్తే..అసలు రాజధానికి ఎంత పెడతారో చూడాలి. మరో రెండు నెలల్లో ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. దీంతో జగన్ తొలి టర్మ్ రాజధాని వ్యవహారం గందరగోళంతోనే ముగియనుంది. వైసీపీ మూడు రాజధానుల నినాదంతో..తెలుగు దేశం పార్టీ అమరావతి ఒకే రాజధాని నినాదంతో ఎన్నికలకు వెళ్ళటం ఖాయంగా అనిపిస్తోంది. నిబంధనలు ఉల్లఘించి మరీ రుషికొండ పై నిర్మాణాలు చేపట్టారు అనే విమర్శలు కూడా ఉన్నాయి.

Next Story
Share it