Telugu Gateway
Andhra Pradesh

వైరల్ గా మారిన ఓల్డ్ ట్వీట్

వైరల్ గా మారిన ఓల్డ్ ట్వీట్
X

జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముందు ఒకటి మాట్లాడటం ...తర్వాత పూర్తి రివర్స్ గా మారిపోవటం ఎన్నో విషయాల్లో జరిగింది. ఇప్పుడు మరో సారి ఆయన బుక్ అయినట్లే కనిపిస్తోంది. అది ఎలాగా అంటే తిరుమల తిరుమతి దేవస్థానం (టిటిటి) ఈఓ నియామకానికి సంబంధించిన వ్యవహారంలో. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తొలిసారి అధికారంలోకి వచ్చిన టీడీపీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పటి నుంచో ఉన్న సంప్రదాయాన్ని తుంగలో తొక్కారు. ఆయన జమానాలోనే రాజకీయ నాయకుడిగా వ్యవహరించారు అనే పేరున్న ఐఏఎస్ అధికారి ప్రభావంతో పాటు ఇతర కారణాలతో చంద్రబాబే తొలిసారి ఉత్తరాదికి చెందిన అనిల్ కుమార్ సింఘాల్ ను టీటీడీ ఈఓ గా నియమించారు. వాస్తవానికి ఎప్పటి నుంచో టీటీడీ ఈఓ పోస్ట్ రాష్ట్రానికి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారులకు మాత్రమే కేటాయిస్తూ వచ్చే వాళ్ళు. కానీ చంద్రబాబు రాజకీయ కారణాలో..ఇతర ఒత్తిళ్లో తెలవదు కానీ..తొలిసారి దీన్ని 2017 లో బ్రేక్ చేసి అనిల్ కుమార్ సింఘాల్ ను టీటీడీ ఈఓ గా నియమించారు. ఈ నియామకాన్ని అప్పటిలో జనసేన అధినేత గా ఉన్న పవన్ కళ్యాణ్ తీవ్రంగా వ్యతిరేకించారు.

ఎన్నడూలేని రీతిలో ఒక ఉత్తరాది ఐఏఎస్ కు ఈ పోస్ట్ ఎలా ఇస్తారు అని ట్విట్టర్ వేదికగా ప్రశించటమే కాకుండా...చంద్రబాబు ఈ అంశంపై ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాను ఉత్తరాది ఐఏఎస్ లకు వ్యతిరేకం కాదు అంటూ...ఉత్తరాది లో ఉన్న ప్రముఖ దేవాలయాల్లో ఇలాగే దక్షిణ భారత అధికారులను అనుమతిస్తారా అని ప్రశ్నించారు. 2017 మే 8 న పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. అక్కడ సీన్ కట్ చేస్తే ఇప్పుడు అదే అనిల్ కుమార్ సింఘాల్ కు జనసేన కీలక భాగస్వామిగా ఉన్న ప్రభుత్వంలో...ఆయన ఉప ముఖ్యమంత్రి గా ఉన్న కూటమి సర్కారు రెండవసారి టీటీడీ ఈఓ పోస్ట్ ఇచ్చింది. ఆయన బుధవారం నాడే బాధ్యతలు స్వీకరించారు కూడా. కానీ ఇప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ కు ఇవేమి కనిపించవు..వినిపించవు అంటూ సోషల్ మీడియా లో ఆయనపై పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇక్కడ మరో కీలక విషయం ఏమిటి అంటే తిరుపతిలో జరిగిన తొక్కిసలాట దుర్ఘటనలో ఆరుగురు భక్తులు చనిపోయిన సమయంలో టీటీడీ ఈఓ తో పాటు జెఈఓ పై కూడా చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ కోరినట్లు జనసేన వర్గాలు వెల్లడించాయి. అదే సమయంలో ఆయన వీళ్లందరిని దుర్ఘటనకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయగా..వాళ్ళు మాత్రం స్పందించలేదు. అయితే ప్రభుత్వం మాత్రం ఇప్పుడు తాజా బదిలీల్లో ఈఓ శ్యామల రావు ను బదిలీ చేసింది కానీ...జెఈఓ ను టచ్ చేయలేదు. పైగా గతంలో పవన్ కళ్యాణ్ తీవ్రంగా వ్యతిరేకించిన అనిల్ కుమార్ సింఘాల్ ను రెండవ సారి ఈఓ గా నియమించారు. దీంతో ఇదే ఇప్పుడు సోషల్ మీడియా తో పాటు రాజకీయ వర్గాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది.

Next Story
Share it