రాష్ట్ర ఖజానాపై భారం పడేలా ప్రైవేట్ సంస్థకు భారీ రాయితీలు!

రాష్ట్ర ఖజానాపై భారం పడేలా ప్రైవేట్ సంస్థకు భారీ రాయితీలు
ఐదేళ్లు ఉన్న జగన్ కూడా హ్యాండ్సప్
ప్రధాని మోడీ పై పొగడ్తల వర్షం కురిపించటంలో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు...ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు ఛాన్స్ దొరికినప్పుడల్లా పోటీలు పడుతున్నారు. కానీ విభజన చట్టానికి సంబంధించిన హామీల సాధన విషయంలో ఇద్దరూ మౌనం దాల్చుతున్నారు. ఒక వైపు రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది అని చెపుతూనే చట్టబద్ధంగా రావాల్సిన హామీని కూడా కేంద్రం నుంచి పొందలేకపోతున్నారు. ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు...పవన్ కళ్యాణ్ లు కనీసం కేంద్రం దగ్గర ప్రస్తావించటం కూడా లేదు. విభజన చట్టంలో ఉన్న ఈ హామీని పొందలేకపోయిన వీళ్ళు ప్రైవేట్ సంస్థకు మాత్రం భారీ ఎత్తున రాయితీలు ఇచ్చి మరీ ప్రాజెక్ట్ సాధించినట్లు గొప్పలు చెప్పుకుంటున్నారు. మొత్తం 16500 కోట్ల రూపాయల పెట్టుబడితో అమలు చేయనున్న ఈ స్టీల్ ప్రాజెక్ట్ కు సంబంధించి ప్రైవేట్ కంపెనీకి ప్రభుత్వం ఏకంగా 50 శాతం మేర స్థిర మూలధన సబ్సిడీ ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. ఇది ఒక్కటే కాదు...ఈ ప్రాజెక్ట్ కు ప్రభుత్వం కల్పించే రాయితీలు ఇంకా చాలానే ఉన్నాయి.
కేంద్రంలోని మోడీ సర్కారు ఆంధ్ర ప్రదేశ్ విభజన చట్టంలో ఉన్న కీలక హామీలు అన్నీ అటకెక్కించిన విషయం తెలిసిందే. అత్యంత కీలకమైన ప్రత్యేక హోదా కు తిలోదకాలు ఇచ్చారు. దీని బదులు ప్రత్యేక ప్యాకేజీ తో సరిపెట్టారు. ప్యాకేజి పాచిపోయిన లడ్డూ అంటూ అప్పటిలో విమర్శించిన పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ఆ విషయమే మర్చిపోయారు. వెనకబడిన రాయలసీమ ప్రాంతంలోని కడప లో సమగ్ర స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని కూడా పునర్విభజన చట్టంలోని 13 వ షెడ్యూలు లో పేర్కొన్నారు. కానీ తర్వాత కేంద్రంలోని మోడీ సర్కారు కడప లో స్టీల్ ప్లాంట్ ఆర్థికంగా లాభదాయకం కాదు అని తేల్చి ఈ హామీని కూడా పక్కనపడేసింది. ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే రాష్ట్ర విభజన తర్వాత రెండు సార్లు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు కడప స్టీల్ ప్లాంట్ విషయంలో ఎప్పుడూ కేంద్రాన్ని గట్టిగా అడిగిన దాఖలాలు లేవు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నా కూడా ఈ స్టీల్ ప్లాంట్ కోసం గట్టిగా ప్రయత్నాలు చేయలేదు అనే చెప్పొచ్చు. గతంతో పోలిస్తే ఈ సారి మోడీ సర్కారు రాజధాని అమరావతికి ఉదారంగా అప్పులు ఇప్పిస్తోంది తప్ప...ఇతర విషయాల్లో పెద్దగా సాయపడుతున్న దాఖలాలు లేవు అని చెపుతున్నారు.
ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి కడప స్టీల్ ప్లాంట్ ప్రాజెక్ట్ శంఖుస్థాపనలు జరుగుతున్నాయి కానీ ఈ ప్రాజెక్ట్ మాత్రం టేకాఫ్ కావటం లేదు. 2007 జూన్ 10 న ఫస్ట్ టైం అప్పటి ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గాలి జనార్దన్ రెడ్డికి చెందిన బ్రాహ్మణి ఇండస్ట్రీస్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన చేశారు. దీని కోసమే గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసి)కి అనంతపురం లో వేల కోట్ల రూపాయల విలువైన ఐరన్ ఒర్ లీజీలు కేటాయించారు. గాలి జనార్దన్ రెడ్డి ఇనుపఖనిజం అమ్ముకుని సొమ్ముచేసుకున్నాడు కానీ..స్టీల్ ప్లాంట్ మాత్రం రాలేదు. మొదటి శంకుస్థాపన జరిగి రెండు దశాబ్దాలు కావస్తోంది కానీ..ఇంకా ఈ స్టీల్ ప్లాంట్ ప్రాజెక్ట్ శంకుస్థాపన దశలను దాటడం లేదు.
ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడే కాదు...ఐదేళ్లు అధికారంలో ఉన్న జగన్ మోహన్ రెడ్డి కూడా మూడేళ్ళలో స్టీల్ ప్లాంట్ ను పూర్తి చేయించుతాను అని ప్రకటించి హ్యాండ్సప్ అన్నారు తప్ప ప్రాజెక్ట్ టేకాఫ్ కాలేదు. తొలి శంకుస్థాపన జరిగి 20 సంవత్సరాలు అవుతున్న వేల ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో సారి జులై 3 న శంకుస్థాపన చేయబోతున్నారు. ప్రైవేట్ సంస్థ జెఎస్ డబ్ల్యూ స్టీల్ ఈ ప్రాజెక్ట్ ను అమలు చేయబోతోంది. మరి ఈ సారి అన్నా ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాలుస్తుందా లేదా అన్నది వేచిచూడాల్సిందే. నేతలు కేంద్రం నుంచి పొందాల్సిన హామీలు పొందకుండా వైఫల్యం చెందటమే కాదు...వాళ్ళ వైఫల్యాలకు ఇప్పుడు ప్రైవేట్ సంస్థలకు ఇచ్చే వేల కోట్ల రూపాయల భారాన్ని రాష్ట్ర ప్రజలు మోయాల్సి వస్తోంది. అయినా ఈ విషయంపై అటు సీఎం చంద్రబాబు నాయుడు..ఇటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు మాత్రం మోడీ ని పల్లెత్తి మాట అనరు.



