ఈ టెండర్ ప్రభుత్వ ఖజానాకు ‘టెండర్’ పెట్టేందుకే !

ఈ అవినీతి చూసి మొక్కలు కూడా సిగ్గుపడతాయి. ఎందుకంటే అమరావతి డెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఏడీసిఎల్ ) పిలిచిన టెండర్ చూసి అధికారులు కూడా అవాక్కుతున్నారు. విజయవాడ లోని రామవరప్పాడు నుంచి గన్నవరం ఎయిర్ పోర్ట్ వరకు సాఫ్ట్ స్కేప్ తో పాటు గ్రీనరీ నిర్వహణ కోసం ఏకంగా 799 లక్షల రూపాయల అంచనా వ్యయంతో టెండర్ పిలిచారు. అంటే దగ్గర దగ్గర ఎనిమిది కోట్ల రూపాయలు అన్న మాట. ఇది 2025 -2026 కాలానికి. విజయవాడ లోని రామవరప్పాడు నుంచి గన్నవరం ఎయిర్ పోర్ట్ కు మధ్య దూరం దగ్గర దగ్గర పదమూడు కిలోమీటర్ లు ఉంది. ఇంత మొత్తానికి ఎనిమిది కోట్ల రూపాయలు అంటే చాలా చాలా ఎక్కువ అని..ఇంతకంటే దారుణం మరొకటి ఉండదు అని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు చెపుతున్నాయి.
సాఫ్ట్‌స్కేప్ అంటే చిన్న చెట్లు, పొదలు, పువ్వులు, పచ్చిక బయళ్లతో సహ అన్ని మొక్కలు, వృక్షసంపదను కలిగి ఉండే ప్రదేశం. ఎంత ఖరీదు అయిన మొక్కలు పెట్టినా ..ఎంత అద్భుతంగా చేసినా కూడా ఇంత వ్యయం కాదు అన్నది ఎక్కువ మంది చెపుతున్న మాట. ఇది ప్రజాధనం దోపిడీకి ప్లాన్ తప్ప మరొకటి కాదు అని అధికారులు కూడా చెపుతున్నారు. అదేమీ విచిత్రమో కానీ...చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి అయినా కూడా అమరావతి డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్ పర్సన్ , మేనేజింగ్ డైరెక్టర్ గా రిటైర్డ్ ఐఏఎస్ లక్షి పార్థసారధిని నియమిస్తారు. చంద్రబాబు ఫస్ట్ టర్మ్ లో ఆమె ఇదే పోస్ట్ లో చేశారు...ఇప్పుడు కూడా అంటే రెండవ టర్మ్ లో ఆమె ఇదే పోస్ట్ లో ఉన్నారు. ఇక్కడ మరో విచిత్రం ఏమిటి అంటే ఫస్ట్ టర్మ్ లో కూడా ఆమె ఏడీసిఎల్ చైర్ పర్సన్ , మేనేజింగ్ డైరెక్టర్ ఉన్న సమయంలో కూడా మొక్కలు కొనుగోలులో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్లు వార్తలు వచ్చాయి.
అప్పుడు కూడా ఐదు వందల రూపాయల విలువ చేసే దేవగన్నేరు మొక్కలను ఏకంగా 2800 రూపాయలకు కొనుగోలు చేసేందుకు టెండర్లు పిలిచారు. అప్పటిలో కూడా అక్కడ మొక్కల పేరుతో సాగుతున్న దోపిడీ చూసి భయపడి ఓ రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి ఉద్యోగాన్ని కూడా కూడా వదులుకుని వెళ్ళిపోయారు అని అధికార వర్గాలు తెలిపాయి. ఇది అంతా కూడా 2018 సెప్టెంబర్ లో జరిగింది. మళ్ళీ ఇప్పుడు లక్షి పార్థసారధి సారథ్యంలోని ఏడీసిఎల్ సాఫ్ట్ స్కేపింగ్, గ్రీనరీ నిర్వహణ పేరుతో అడ్డగోలు ధరలు నిర్ణయించి పెద్ద ఎత్తున అవినీతికి ఆస్కారం కలిపించబోతున్నట్లు చెపుతున్నారు. ఒక వైపు అమరావతి టెండర్ల లో పెద్ద ఎత్తున గోల్ మాల్ జరిగినట్లు ఆరోపణలు వస్తుంటే ఇప్పుడు ఏకంగా గ్రీనరీ నిర్వహణ, సాఫ్ట్ స్కేపింగ్ కోసం కూడా కోట్ల రూపాయల తో అంచనాలు రూపొందించటం దుమారం రేపుతోంది.



