క్యాబినెట్ లో ఎప్పుడైనా వీటిపై ప్రశ్నించారా!

మౌనంగా ఉంటే అన్నీ ఒప్పుకున్నట్లేగా!
చింతా గ్రీన్ ఎనర్జీ కి మరో 2000 మెగావాట్ల పీఎస్ పీ ప్రాజెక్ట్
కొత్తగా కేటాయించిన దానితో విశ్వేశ్వర్ రావు ఫ్యామిలీ కి మొత్తం 11100 మెగావాట్ల ప్రాజెక్టులు
చింతా గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీ పుట్టిందే ఈ ఏడాది జనవరి 17 న. విచిత్రం ఏమిటి అంటే దీని ప్రమోటర్లు నవయుగా అధినేత చింతా విశ్వేశ్వర్ రావు. నివాసం ఉండేది హైదరాబాద్ లో. కానీ ఈ చింతా గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ను మాత్రం ఢిల్లీ రిజిస్ట్రార్ అఫ్ కంపెనీస్( ఆర్ ఓసి) లో రిజిస్టర్ చేయించారు. ఇది ఏమి తప్పు కాకపోయినా ఆంధ్ర ప్రదేశ్ లో వరస ప్రాజెక్ట్ లు దక్కించుకుంటున్న ఈ కంపెనీ ఢిల్లీ ఆర్ఓసి లో ఎందుకు నమోదు అయింది అన్నది కూడా ఆసక్తికర పరిణామమే అని చెప్పాలి. ఈ కొత్త కంపెనీ అలా పుట్టిందో లేదో ఆంధ్ర ప్రదేశ్ లోని చంద్రబాబు సారథ్యంలోని కూటమి సర్కారు ఎడాపెడా చింతా గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కు వరసపెట్టి వేల మెగావాట్ల సామర్థ్యంతో కూడిన విద్యుత్ ప్రాజెక్ట్ లు కేటాయించుకుంటూ పోతూనే ఉంది. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అద్యక్షతన జరిగే ఎస్ ఐ పీబీ సమావేశాల్లో ఇంచుమించు ప్రతిసారి విశ్వేశ్వర రావు ఫ్యామిలీ కి చెందిన కంపెనీలకు పవర్ ప్రాజెక్ట్ లు కేటాయించుకుంటూ పోతూనే ఉన్నారు.
ఒక్క చింతా గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కే కాకుండా నవయుగా ఇంజనీరింగ్ కు...ఆ తర్వాత విశ్వేశ్వర్ రావు అల్లుడి కంపెనీ అయిన ఆర్ విఆర్ ప్రాజెక్ట్స్ కూడా ఏపీలో విద్యుత్ ప్రాజెక్ట్ లు కేటాయించారు. చింతా గ్రీన్ ఎనర్జీ తో పాటు చింతా విశ్వేశ్వరావు ఫ్యామిలీకి చెందిన కంపెనీలు అన్నిటికి కలిపి ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి సర్కారు కేటాయించిన మొత్తం విద్యుత్ ప్రాజెక్ట్ ల సామర్థ్యం 11 ,110 మెగావాట్లు. కొద్ది రోజుల క్రితమే గతంలో కేటాయించిన మొత్తం చాలదు అన్న చందంగా పలు ప్రాజెక్టుల సామర్థ్యం సామర్థ్యం కూడా గణనీయంగా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇవి చాలవు అన్నట్లు ఇప్పుడు కొత్తగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఉమ్మడి విజయనగరం జిల్లా మక్కువ మండలం దుగ్గేరు దగ్గర 2000 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన పంప్డ్ హైడ్రో స్టోరేజ్ ప్రాజెక్ట్ కేటాయిస్తూ మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.
ఇటీవల జరిగిన మంత్రి వర్గ సమావేశంలో లూలూ మాల్ షరతులపై జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రశ్నించినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ప్రశ్నలు వచ్చినా కూడా క్యాబినెట్ లో లూలూ వైజాగ్ ప్రాజెక్ట్ కు ఆమోదం తెలిపారు. అయితే ఇక్కడ కీలక విషయం ఏమిటి అంటే ఒకే ఒక్క ఫ్యామిలీ కి వరసపెట్టి ఆంధ్ర ప్రదేశ్ లో వేల మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్ట్ లు కేటాయించుకుంటూ పోతున్నా కూడా ఇప్పుడు లూలూ పై ప్రశ్నించిన తరహాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు ఈ అంశంపై మాట్లాడటం లేదు. ఒకే ఫ్యామిలీ కి చెందిన కంపెనీలకు విద్యుత్ రంగంలో ఈ గుత్తాధి పత్యం ఏంటి అని ఎందుకు అడగటం లేదు. పవన్ కళ్యాణ్ ఇంతటి కీలక అంశంపై మౌనంగా ఉన్నారు అంటే ఆయన కూడా వీటికి అంగీకరిస్తున్నట్లే అన్న చర్చ తెర మీదకు వస్తోంది. మరో వైపు కొన్ని కంపెనీలను ముందు పెట్టి అధికారంలో ఉన్న వాళ్లే రాష్ట్రంలో కొన్ని ప్రాజెక్ట్ లను దక్కించుకుంటున్నారు అని ఐఏఎస్ సర్కిల్స్ లో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది.ఈ మొత్తం వ్యవహారంపై అటు పవన్ కళ్యాణ్ కానీ..ఇటు బీజేపీ నేతలు అంటే క్యాబినెట్ లో ఉండే మంత్రి సత్య కుమార్ కానీ..ఇతర నేతలు ఎవరూ మాట్లాడక పోవటంతో ఇది అంతా కలిసి చేస్తున్నారు అనే అనుమానాలు వస్తున్నాయని అధికారులు చెపుతున్నారు.



