Telugu Gateway
Andhra Pradesh

భూమి విలువ వెయ్యి కోట్లు ...పెట్టుబడి 750 కోట్లు

భూమి విలువ వెయ్యి కోట్లు ...పెట్టుబడి 750 కోట్లు
X

వైజాగ్ లో టిసిఎస్ కు 99 పైసలకే వందల కోట్ల రూపాయల విలువ చేసే 21 ఎకరాలు కేటాయించిన ఆంధ్ర ప్రదేశ్ సర్కారు ఇప్పుడు మరో కంపెనీ కి కూడా అలాంటి కేటాయింపులే చేసింది. అయితే ఈ సారి వంతు మరో దిగ్గజ ఐటి కంపెనీ ఇన్ఫోసిస్ కు ఈ ఛాన్స్ దక్కింది. ఈ కంపెనీకి విశాఖ జిల్లా ఎండాడ లో 99 పైసలకే 20 ఎకరాలు కేటాయించాలని నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఆంధ్ర ప్రదేశ్ ఐటి శాఖ. ఈ 20 ఎకరాల్లో కంపెనీ 750 కోట్ల రూపాయల పెట్టుబడితో 7000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉంది ని జీవోలో పేర్కొన్నారు. ఆంధ్ర ప్రదేశ్ ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్ హబ్స్ (లిఫ్ట్) విధానం ప్రకారం కంపెనీ ఎకరాకు 500 ఉద్యోగాలు కల్పించేందుకు కట్టుబడి ఉండాలి. అయితే కంపెనీకి కేటాయించిన 20 ఎకరాల భూమికి గాను మొత్తం 7,000 మందికి మాత్రమే ఉద్యోగాలు కల్పిస్తామని ఇన్ఫోసిస్ చెపుతోంది. విశాఖపట్నంలో టైర్ 1 కంపెనీల అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం ఇన్ఫోసిస్ ను 10,000 సీటింగ్ సామర్థ్యంతో క్యాంపస్ ఏర్పాటు చేయాలని కోరింది.

దీనిపై కంపెనీ ఎలాంటి హామీ ఇవ్వకపోయినా కూడా వందల కోట్ల రూపాయల విలువైన ఈ భూమిని సేల్ డీడ్ అమలు కోసం దీనిని తప్పనిసరి షరతుగా ప్రభుత్వం పెట్టలేదు. అంటే ప్రభుత్వం తన విధానాన్ని తానే ఉల్లఘించి కంపెనీ ఏది చెపితే దానికి ఓకే చేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. తాజాగా ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల్లో నిబంధనలు అన్నీ కూడా కంపెనీ కోరినట్లే ఉన్నాయి. ఇన్ఫోసిస్ తన తొలిదశ ప్రాజెక్ట్ ను 2029 జనవరికి పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రాజెక్ట్ ప్రగతి ఆధారంగా తొలిదశ పూర్తికి అదనంగా మరో ఏడాది గడువు ఇచ్చే వెసులుబాటు కల్పించారు. తొలి దశ...రెండవ దశ కలుపుకుని మొత్తం ఆరు సంవత్సరాల్లో ప్రాజెక్ట్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా మరో రెండేళ్లు గడువు పొడిగించే వెసులుబాటు ఉంది.

వీటితో పాటు ఏపీఐఐసీ ఈ ప్రాజెక్ట్ కు అవసరమైన రహదారులతో పాటు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలి అని జీవోలో ఆదేశించారు. ఎండాడ కొండ లే అవుట్ లో మొత్తం 79 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో మౌలిక సదుపాయాల కల్పనకు ఐటి శాఖ పరిపాలన పరమైన అనుమతులు మంజూరు చేసింది. ఈ కంపెనీకి ఏపీ ఐటి , జీసీసీ పాలసీ ప్రకారం అన్ని ఇతర ప్రోత్సహకాలు దక్కుతాయి అని జీవో లో స్పష్టం చేశారు. దిగ్గజ ఐటి కంపెనీలకే కాకుండా ఐటి అభివృద్ధి పేరుతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ సంస్థలకు కూడా వైజాగ్ కోట్ల రూపాయల విలువ చేసే భూములను కారు చౌకగా కట్టబెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వైజాగ్ లోని ఎండాడలో ఇన్ఫోసిస్ కోసం కేటాయించిన భూమి విలువ తక్కువలో తక్కువ వెయ్యి కోట్ల రూపాయలు ఉంటుంది వైజాగ్ రియల్ ఎస్టేట్ వర్గాలు చెపుతున్నాయి.

ప్రభుత్వం నుంచి వెయ్యి కోట్ల రూపాయల విలువ చేసే భూములను కేవలం 99 పైసలకే దక్కించుకున్న ఇన్ఫోసిస్ కంపెనీ 2026 మార్చి తో ముగిసిన మూడు నెలల కాలానికి 8501 కోట్ల రూపాయల నికర లాభం దక్కించుకుంది. ఇంతటి లాభాలు గడించే కంపెనీకి అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఏపీ ప్రభుత్వం ఇంత ఉదారంగా భూములు కేటాయించటం చూసి అధికారులు కూడా అవాక్కు అవుతున్నారు. మాట్లాడితే ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ లు తమ వాళ్ళ...తమ బ్రాండ్ తోనే రాష్ట్రానికి పెట్టుబడులు వరదలా వచ్చిపడుతున్నాయి అని చెప్పుకుంటున్నారు. కానీ వాస్తవ పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది అనే చెప్పాలి. ఒక్క ఐటి కంపెనీలే కాదు..ఇతర పరిశ్రమలకు కూడా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కల్పించే రాయితీలు..ప్రోత్సహకాలు దేశంలో మరో రాష్ట్రంలో ఎక్కడా ఇవ్వరు అని అధికార వర్గాలు కూడా వ్యాఖ్యానిస్తున్నాయి.

Next Story
Share it