కోట్ల రూపాయల ముడుపులే దీనికి కారణమా?!
AP Rice Export Scam: Why Has the SIT Investigation Stalled for Two Years?!

బూతులు తిట్టిన వాళ్ళను కూడా కోట్ల ముడుపులతో కనికరించారా!
కూటమి నేతల్లో సాగుతున్న చర్చ
వైసీపీ హయాంలో జరిగిన స్కాం ల విషయంలో చర్యల కంటే సెటిల్ మెంట్సే ఎక్కువ నడుస్తున్నాయి అనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. వైజాగ్ భూముల స్కాం అయినా...విద్యుత్ శాఖలో జరిగినా కుంభకోణాలు అయినా కూటమి నేతలు అన్నటికి ఒకే రూల్ ఫాలో అవుతున్నారు అని చెపుతున్నారు. పైగా కూటమి ప్రభుత్వంలో ఎక్కువ శాతం కాంట్రాక్టులు కూడా గత వైసీపీ హయాంలో ఒక వెలుగు వెలిగిన వాళ్ళకే దక్కుతున్నాయి అనే ప్రచారం టీడీపీ నేతల్లోనే ఉంది. ఎక్కడ వరకో ఎందుకు ప్రభుత్వంలో అత్యంత కీలకంగా ఉన్న ఐటి, మానవనరుల శాఖ మంత్రి నారా లోకేష్ చూస్తున్న విద్యా శాఖలో కూడా అదే పరిస్థితి ఉన్నట్లు ఆ పార్టీ నేతలు వెల్లడిస్తున్నారు. వైసీపీ హయాంలో పేదలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని పాలిష్ చేసి విదేశాలకు ఎగుమతి చేశారు అని...ఇది పెద్ద స్కాం గా గుర్తించారు. దీనిపై కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విజిలెన్స్ విచారణ జరిగితే ఇది ఒక పెద్ద నెట్ వర్క్ గా తేల్చారు. ఆ తర్వాత 2024 డిసెంబర్ లో ప్రభుత్వం ఈ విచారణను సిట్ కు అప్పగించింది. ఒక్క కాకినాడ లోనే పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా ఎగుమతి చేశారనే కారణంతో ఎన్నో కేసులు నమోదు చేశారు.
విచిత్రం ఏమిటి అంటే సిట్ ఏర్పాటు అయి మరికొద్ది రోజుల్లోనే రెండు సంవత్సరాలు కావస్తున్నా కూడా ఇంతవరకు ఈ కేసు లో ఎలాంటి పురోగతి ఉన్నట్లు కనిపించటం లేదు అని అధికార వర్గాలు చెపుతున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలో ఇప్పుడు పౌర సరఫరాల శాఖ జనసేన కు చెందిన మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యవేక్షిస్తున్నారు. వైసీపీ హయాంలో ముఖ్యంగా కాకినాడ నుంచి బియ్యం ఎగుమతి చేసిన అంశంలో కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. అయితే ఆయన అప్పటిలోనే వాటిని తోసిపుచ్చారు. ప్రతిపక్షంలో ఉండగా టీడీపీ నేతలతో పాటు జనసేన నాయకులు కూడా ఆయనపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎన్నికలకు ముందు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై కూడా బహిరంగంగా అత్యంత దారుణమైన ..అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు.
తాము అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్ర శేఖర్ రెడ్డి సంగతి చెపుతాం అంటూ కూడా పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో సవాళ్లు చేశారు. సీన్ కట్ చేస్తే ఆంధ్ర ప్రదేశ్ వేదికగా కాకినాడ పోర్ట్ తో పాటు కృష్ణపట్నం, చెన్నయ్ ఓడరేవుల నుంచి బియ్యం అక్రమంగా ఎగుమతి చేసి కోట్ల రూపాయలు సంపాదించాడు అనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ద్వారంపూడి చంద్ర శేఖర్ రెడ్డి లికి కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు వెళ్ళలేదు. అంటే వీళ్ళు చెప్పినట్లు..ఆరోపించినట్లు వైసీపీ హయాంలో స్కాం జరగలేదా..లేక వాళ్ళతో కూడా సెటిల్మెంట్స్ చేసుకున్నారా అన్న చర్చ అటు టీడీపీ తో పాటు జనసేన వర్గాల్లో కూడా సాగుతోంది. మరో కీలక విషయం ఏమిటి అంటే పార్టీ అవసరాల పేరు చెప్పి గత ప్రభుత్వంలో బియ్యం స్కాం లో కీలక పాత్ర పోషించిన వాళ్ళ దగ్గర కోట్ల రూపాయల ముడుపులు తీసుకోవటం కారణంగానే సిట్ విచారణలో ఎలాంటి ప్రగతి లేకుండా పోయింది అనే చర్చ కూడా రెండు పార్టీల నేతల్లో సాగుతోంది. కూటమిలోని కీలక పార్టీలు చర్యలు కంటే సెటిల్మెంట్స్ మోడల్ ను ఫాలో కావటం వల్లే ఇలా జరుగుతోంది అని చెపుతున్నారు. మరి ఈ కోట్ల రూపాయల ముడుపులు ఎవరి ఖాతాల్లోకి వెళ్లాయి. దీనికి సంబంధించి త్వరలోనే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం అని ఒక కీలక నేత వెల్లడించారు.



