అధికార వైసీపీ తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక ఫలితంపై పూర్తి స్థాయి ధీమాతో ఉంది. ఈ ఎన్నికలో తమ గెలుపు లాంఛనమే అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. అయితే ఈ ఎన్నిక ఫలితంపై మంత్రులు తలా ఒక లెక్క చెబుతున్నారు. కొంత మంది మంత్రులు అయితే మూడు లక్షల మెజారిటీతో తమ అభ్యర్ధి డాక్టర్ డాక్టర్ గురుమూర్తి గెలుస్తారని చెబుతుంటే..మరికొంత మంది మంత్రులు మాత్రం ఈ మెజారిటీ నాలుగు లక్షల వరకూ ఉంటుందని చెబుతున్నారు. తమ అభ్యర్థి గెలుపునకు జాతీయ స్థాయిలో గుర్తింపు రానుందని మంత్రి పెద్దిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు గుర్తించారన్న ఆయన.. కుప్పంలో టీడీపీ రాద్దాంతం చేస్తోందన్నారు. రోజు రోజుకు వైసీపీకి ప్రజల మద్దతు పెరుగుతోందని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు. వైసీపీ ఈ ఎన్నికను మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకుని పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలకు బాధ్యతలు అప్పగించింది. టీడీపీ తరపున పనబాక లక్ష్మీ ఇప్పటికే నామినేషన్ వేయగా, బిజెపి-జనసేన ఉమ్మడి అభ్యర్ధిగా రిటైర్డ్ ఐఏఎస్ కె. రత్నప్రభ బరిలోకి దిగనున్నారు.