విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకరంగా 22 మంది ఎంపీలు ఉన్న వైసీపీ ఎంతో చేయవచ్చని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఇదే అంశంపై తాము ఢిల్లీ వచ్చి కేంద్ర మంత్రి అమిత్ షాతో పాటు పలువురికి వినతిపత్రం అందించి తమ వంతు ప్రయత్నం చేశామన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుదవారం నాడు ఢిల్లీలో పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తో కలసి మీడియాతో మాట్లాడారు. పోస్కో, ఆర్ఐఎన్ఎల్ మధ్య ఒప్పందం జరిగిందని తెలిసి కూడా సీఎం జగన్ లేఖ రాయటం వెనక మర్మమేంటని ప్రశ్నించారు. విశాఖ ఉక్కును ఓ పరిశ్రమగా..ఏపీ ప్రజల సెంటిమెంట్ గా చూడాల్సిన అవసరం ఉందని చెప్పినట్లు వెల్లడించారు. విశాఖ ఉక్కులో పెట్టుబడుల ఉపసంహరణపై పునరాలోచన చేయాలని కోరామన్నారు. ఈ పర్యటనలో రాష్ట్రంలో నెలకొన్న శాంతిభద్రతల పరిస్థితులు, ఆలయాలపై దాడులు, ఆర్ధిక పరిస్థితులు, నివర్ తుపాను మూలంగా రాష్ట్ర రైతాంగం ఏ విధంగా నష్టపోయారు అనే అంశాలను అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లినట్లు వెల్లడించారు.
వచ్చే నెల 3, 4 తేదీల్లో అమిత్ షా ని తిరుపతి పర్యటనలో మరోసారి కలిసి చర్చిస్తామన్నారు. జనసేన - బీజేపీల రూట్ మ్యాప్ ఎలా ఉండాలి.. ఎన్నికల వరకూ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే అంశం మీద కోర్ కమిటీలో చర్చిద్దామని అమిత్ షా తెలిపారు. శాంతి భద్రతల మీద చాలా దృష్టి ఉంది. వీటన్నింటి మీద లోతుగా మాట్లాడేందుకు వచ్చే నెలలో దానిపై చర్చిస్తామన్నారు. షర్మిల పార్టీ ఏర్పాటుపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా 'పార్టీ ఫామ్ చేసి వారి విధి విధానాలు చూసిన తర్వాత స్పందిద్దాం. ప్రతి ఒక్కరికీ రాజకీయాల్లోకి వచ్చే హక్కు ఉంది. వారి విధివిధానాలు వచ్చాక స్పష్టత తీసుకుందాం. కేసీఆర్ పరిపాలనపై నేను హైదరాబాద్ లో మాట్లాడుతా' అన్నారు.