తెలంగాణలో షర్మిల పార్టీ ప్రారంభోత్సవం సందర్భంగా వైఎస్ విజయమ్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె పరోక్షంగా ఇటీవల కాలంలో తెలంగాణ మంత్రులు చేసిన విమర్శల గురించి ప్రస్తావించారు. వైఎస్ బిడ్డలు దొంగలు.. గజదొంగలు కాదన్నారు. మాటిస్తే ముందుకెళ్లడం తండ్రి నుంచి షర్మిల నేర్చుకుందన్నారు. వైఎస్ వచ్చాక తుపాకుల మోతలు ఆగిపోయాయని, పల్లె బతికిందన్నారు. రక్తం కాదు.. నీరు మాత్రమే పారాలని ఆలోచించారన్నారు. ప్రాజెక్టులన్నీ వైఎస్ హయాంలోనే మొదలయ్యాయని, షర్మిలను మీ కుటుంబంలో ఒకరిగా చూడండని కోరారు. రాజన్న రాజ్యం తెలంగాణ జన్మహక్కు అని షర్మిల నమ్ముతోందన్నారు. తెలంగాణ బిడ్డలకు బంగారు భవిష్యత్ ఇవ్వడానికి ముందుకొస్తోందన్నారు. అన్ని రాష్ట్రాలు బలంగా ఉంటే దేశం బలంగా ఉంటుందని, సమస్యలు పరిష్కరించుకుని రెండు రాష్ట్రాలు ఎదగాలని విజయలక్ష్మి అన్నారు.
మాటలు మార్చడం వారికి తెలియదని.. మాటకు ప్రాణం ఇచ్చేవాళ్లన్నారు. తమ కుటుంబానికి దాచుకోవడం.. దోచుకోవడం తెలియదన్నారు. వైఎస్ అన్ని ప్రాంతాలను సమానంగా చూశారన్నారు. షర్మిల పార్టీ ప్రకటించగానే ఎంతో మంది విమర్శలు ప్రారంభించారని ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలోనూ ఇది సాగిందని తెలిపారు. వైఎస్ విజయమ్మ తన ప్రసంగంలో పలుమార్లు వైఎస్ జగన్ పేరును ప్రస్తావించారు. అప్పట్లోఅన్న ఆదేశాల మేరకు షర్మిల తెలంగాణలో పాదయాత్ర చేసిందని తెలిపారు. వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా షర్మిల గురువారం సాయంత్రం హైదరాబాద్ లో పార్టీని ప్రారంభించటంతోపాటు... పార్టీ జెండాను ఆవిష్కరించారు.