తెలంగాణలో మరో కొత్త పార్టీ వచ్చింది. వైఎస్ షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ (వైఎస్ఆర్ టీపీ) ని గురువారం నాడు ప్రారంభించారు. పార్టీ జెండాను కూడా ఆవిష్కరించారు. వైఎస్ జయంతి సందర్బంగా నగరంలోని ఓ కన్వెన్షన్ సెంటర్ లో ఈ కార్యక్రమం జరిగింది. వైఎస్ సంక్షేమ పాలన తేవడమే వైఎస్ఆర్ టీపీ లక్ష్యమని వైఎస్ షర్మిల వెల్లడించారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ప్రకటించిన ఆమె సీఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణలో పేదరికం పోలేదని వ్యాఖ్యానించారు. రూపాయి బియ్యం కోసం ఇంకా రేషన్ షాపుల ఎదుట లైన్లు ఉంటున్నామని ఆమె పేర్కొన్నారు. ''అధికారం ఉన్నప్పుడే ఫామ్‌హౌస్ చక్కబెట్టుకుంటున్నారు. కేసీఆర్ కుటుంబం దోచుకుని దాచుకుంటోంది. పేదరికం నుంచి బయటపడింది కేసీఆర్ ఫ్యామిలీనే. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి ఉంటే పేదలకు భరోసా ఉండేది. కరోనాకు ఎంతో మంది బలైపోయారు.. ఆస్తులమ్ముకున్నారు. సంక్షేమంలో దేశంలోనే నెంబర్ వన్ అని చెప్పుకుంటున్న కేసీఆర్ ఆస్తులమ్ముకున్న కుటుంబాలకు ఏం సమాధానం చెబుతారు?. తప్పు అయిందని ముక్కు నేలకు రాస్తే కేసీఆర్ పాపం పోతుందా?. వైఎస్ సంక్షేమం అంటే భరోసా, రక్షణ, భద్రత. వైఎస్ సంక్షేమం అంటే కరోనాలాంటి ఎన్ని విపత్తులు వచ్చినా అప్పులపాలు కాకుండా నాణ్యమైన వైద్యాన్ని ఉచితంగా పొందడం వైఎస్ బతికి ఉంటే అదే చేసేవారు అని షర్మిల తెలిపారు.
''కేసీఆర్ సంక్షేమం అంటే పథకాలు ప్రకటించి దిక్కులు చూడాలి. ఆరోగ్య కార్డులు ఇవ్వాలి.. ఆరోగ్యాన్ని గాలికి వదిలేయాలి. రైతుభరోసా ఇచ్చి ఆ డబ్బును వడ్డీ కింద జమకట్టుకోవాలా?. కేసీఆర్ సంక్షేమం అంటే ఇంటికో ఉద్యోగం అని చెప్పి ఏళ్లు గడిచినా వాయిదా వేసుకోవాలి. 6 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే చనిపోయినవారు రైతులు కాదని చెప్పడం సంక్షేమమా?. కేసీఆర్ సంక్షేమం అంటే గారడీ మాటలు.. చేతికి చిప్పలు. ఎవరిని అడిగినా సంక్షేమానికి రారాజు వైఎస్సార్ అని చెబుతారు. పేదరికాన్ని రూపుమాపడమే వైఎస్సార్ టీపీ లక్ష్యం. తరాలు మారినా తలరాతలు మారడం లేదు. సంక్షేమమంతా రేషన్ బియ్యం చుట్టూనే తిరుగుతోంది.
సంక్షేమం ఆకలి తీర్చి ఆగిపోతోంది.. ఉపాధి కల్పించడంలేదు.'' అని పేర్కొన్నారు. తమ పార్టీ అజెండాలో మూడు ముఖ్యమైన అంశాలను ప్రకటించారు. సంక్షేమం.. స్వయం సంవృద్ధి.. సమానత్వం సాధన దిశగా తమ పార్టీ సాగుతుందన్నారు. నాన్న మాట ఇస్తే బంగారు మూట ఇచ్చినట్టేనని, శత్రువులు సైతం ప్రశంసించిన నేత వైఎస్ అని ఆమె పేర్కొన్నారు. ఆయన జయంతి రోజున ఆయన అడుగుల్లో నడిచేందుకు వైఎస్ఆర్‌టీపీని స్థాపించామన్నారు. ఆయన సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించడానికి వచ్చామన్నారు. ఇవాళ్టికీ వైఎస్ ఓ రోల్ మోడల్ అన్నారు. రుణమాఫీ, ఉచిత విద్యుత్.. పావలా వడ్డీ ఇచ్చారని, కోటి ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని జలయజ్ఞానికి రూపకల్పన చేసిన దార్శనికుడు వైఎస్ అన్నారు. డాక్టరా.. ఇంజినీరా.. ఎంబీయేనా అన్నది తేడా లేకుండా ఉచిత చదువులకు అవకాశం ఇచ్చిన నేత ఆయన అన్నారు. పేద విద్యార్థులకు వందశాతం ఫీజు రీయింబర్స్ మెంట్ కల్పించారని, ఆరోగ్యశ్రీ ఇచ్చిన నేత అన్నారు.