ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు మండిపడ్డారు. 'సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లేది ఎందుకు..? తన కేసుల మాఫీ కోసమా, రాష్ట్ర ప్రయోజనాల కోసమా..? 10సార్లు ఢిల్లీ వెళ్లి రాష్ట్రానికి జగన్ ఒరగబెట్టిందేమిటి..? విశాఖ రైల్వే జోన్ కు నిధులు అడిగావా..? కడప స్టీల్ ప్లాంట్ ఏమైందో అడిగావా..? పెట్రోలియం కాంప్లెక్స్ ఏమైందో ప్రశ్నించావా..? తొలి ఏడాది ఆర్ధిక లోటు కింద కేంద్రం నుంచి రావాల్సిన డబ్బులు అడిగావా..? అప్పుడు మెడలు వంచుతానని చెప్పి, ఇప్పుడు సాష్టాంగ దండ ప్రమాణాలా..?జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఏమి చెప్పారు, ఈ రోజు ఏమి చేస్తున్నారు..?ఆ రోజు రాష్ట్రంలో ఇసుక ఎలా ఉంది, ఈ రోజు ఏమైంది..? ఆ రోజు మైనింగ్ ఎలా ఉంది, ' అంటూ ప్రశ్నించారు. పార్టీ నేతలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో వైసిపి దాడులకు గురికాని వర్గం లేదు. ప్రశాంతమైన గోదావరి జిల్లాల్లో కూడా పులివెందుల మార్క్ ఫాక్షనిజం తెచ్చారు.
వేధింపులు-బెదిరింపులు, దాడులు దౌర్జన్యాలు, రాజోలులో ఇసుక మాఫియాను అడ్డుకున్న దళిత యువకుడు వరప్రసాద్ కు శిరోముండనం...గుంటూరులో మట్టి మాఫియాను అడ్డుకున్న మౌజమ్ హనీఫ్ పై దాడి.. వేధింపులు తట్టుకోలేక నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం సామూహిక ఆత్మహత్య ..రాజమండ్రి ఎస్పీ కార్యాలయం ఎదుటే అబ్దుల్ సత్తార్ ఆత్మహత్యాయత్నం.. నకరికల్లులో ఎస్టీ మహిళను ట్రాక్టర్ తో తొక్కించి చంపడం...ఆడబిడ్డలపై సామూహిక అత్యాచారాలు..ఏపి చరిత్రలో ఎన్నడూ కనీవినీ ఎరుగని దురాగతాలు.' అంటూ విమర్శలు గుప్పించారు. ఒక్కో పథకం(స్కీమ్)లో 3రకాల అవినీతి... భూముల కొనుగోళ్లలో అవినీతి, మట్టి కప్పడంలో అవినీతి, ఇంటి పట్టాల పంపిణీలో వైసిపి వసూళ్ల దందాలు..ఇళ్లస్థలాల పంపిణీ స్కీములోనే వేలకోట్ల స్కామ్ చేశారు. నవరత్నాలన్నీ అవినీతి మయం చేశారని ఆరోపించారు.