వైసీపీలో ఒకప్పుడు ఆయన నెంబర్ టూ స్థానంలో ఉండేవారు. ఇప్పుడు ఆ ప్లేస్ ను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి ఆక్రమించారు. ప్రభుత్వంలో అయినా..పార్టీలో అయినా ఇప్పుడు సజ్జల రామక్రిష్ణారెడ్డిదే హవా. మంత్రులను కూడా కాదని ఆయన పలు అంశాల్లో ముందు వరసలో ఉంటున్నారు. సీఎం జగన్ ఇస్తున్న ప్రాధాన్యత అది. అయితే సీఎం జగన్ తాజాగా తీసుకున్న నిర్ణయం ఒక పార్టీలో ఆసక్తికర చర్చకు తెరతీసింది. వాస్తవానికి ఉత్తరాంధ్ర ఇన్ ఛార్జి బాధ్యతల నుంచి విజయసాయిరెడ్డిని తప్పిస్తారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న విజయసాయిరెడ్డిని అన్ని అనుబంధ విభాగాల ఇన్ ఛార్జిగా నియమించారు. ఈ మేరకు పార్టీ అధినేత, సీఎం జగన్ పేరిట ఒక ప్రకటన విడుదల అయింది. వాస్తవానికి విజయసాయిరెడ్డి ఇప్పుడు వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్నారు. అదే సమయంలో జగన్ సీఎం అయిన తొలి రోజుల్లో ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధిగా కూడా నియమించారు. పార్టీ పరంగా అత్యంత కీలకమైన ఉత్తరాంధ్ర ఇన్ ఛార్జి పోస్టులో ఉన్నారు. ఈ తరుణంలో ఆయనకు అన్ని అనుబంధ విభాగాల ఇన్ ఛార్జిగా నియమించటం ద్వారా జగన్ ఎలాంటి సంకేతాలు పంపారనే అనే అంశంపై ఆసక్తికర చర్చనడుస్తోంది.
ఈ నియామకంపై విజయసాయిరెడ్డి స్పందిస్తూ తనపై నమ్మకంతో పార్టీ అప్పగించిన బాధ్యతలను అంకితభావంతో నిర్వహించి..పార్టీ బలోపేతానికి పనిచేస్తానని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. త్వరలోనే అంటే ఈ జూన్ తో విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వ కాలం ముగియనుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా మార్చిలోనే వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే పలు బాధ్యతలు ఉన్న విజయసాయిరెడ్డికి అనుబంధ విభాగాల బాధ్యతలు కూడా అప్పగించారు అంటే..ఆయనకు ఈ సారి రాజ్యసభ రెన్యువల్ చేయకుండా..పూర్తిగా పార్టీ బాధ్యతలే అప్పగించే అవకాశం ఉందని వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. లేకపోతే ఈ సమయంలో ఈ మార్పు ఉండదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇప్పటికే అధికారుల పరంగా మార్పులకు శ్రీకారం చుట్టిన జగన్ త్వరలోనే పార్టీలో కూడా కీలక మార్పులు చేస్తారని చెబుతున్నారు. మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణతోపాటు పార్టీలోనూ భారీ మార్పులు ఉంటాయని ప్రచారం జరుగుతోంది.