వైసీపీలో ఇటీవల జరిగిన పార్టీ నియామకాల అంశంపై ఆ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి స్పందించారు. తాను ఆ బాధ్యత కావాలి..ఈ బాధ్యత కావాలి అని ఏమీ అడగలేదన్నారు. ప్రాంతీయ పార్టీల్లో అధినేత చెప్పిన దాని ప్రకారం పనిచేసుకుంటూ పోవాల్సిందేనన్నారు. తనకు అనుబంధ విభాగాల బాధ్యత అప్పగించిన అంశంపై ఆయన మీడియా అడిగిన ప్రశ్నలకు స్పందించారు. చార్టెడ్ అకౌంటెంట్ గా ఉన్న తనకు రాజ్యసభ సభ్యత్వం, అత్యంత కీలకమైన పార్లమెంటరీ పార్టీ నేత పదవితోపాటు ఢిల్లీలో ఏపీ ప్రత్యేక ప్రతినిధి, పలు పార్లమెంటరీ కమిటీల బాధ్యతలు సీఎం జగన్ వల్లే వచ్చాయన్నారు.
జగన్ అప్పగించిన పని చేసుకుంటూపోవటమే తన పని అన్నారు.ఇటీవల వరకూ విజయసాయిరెడ్డికి ఉన్న ఉత్తరాంధ్ర ఇన్ చార్జి బాధ్యతలను ఆయన నుంచి తప్పించిన విషయం తెలిసిందే. విశాఖ జిల్లా బాధ్యతలను ఇప్పుడు టీటీడీ ఛైర్మన్ గా ఉన్న వై వీ సుబ్బారెడ్డికి అప్పగించారు. తాజా పరిణామాలతో వైసీపీలో విజయసాయిరెడ్డి ప్రాధాన్యత గణనీయంగా తగ్గిందనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది.