నిరుద్యోగులు హ‌మాలీ ప‌ని చేసుకుంటే త‌ప్పేంటి?

Update: 2021-07-15 14:32 GMT

తెలంగాణ వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి. చదువుకున్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఉద్యోగాలు రావన్నారు. ఆయన నాగర్‌ కర్నూలు జిల్లాలో గురువారం ఏర్పాటు చేసిన ఓ సమావేశలో పాల్గొని మాట్లాడుతూ.. చదువుకున్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఉద్యోగాలు రావని, హమాలీ పని రూపంలో ఉపాధి కల్పిస్తున్నామని అన్నారు. నిరుద్యోగులు హమాలీ పనులు చేసుకుంటే తప్పేంటని వ్యాఖ్యానించారు. గ్రామగ్రామాన ప్రతి సీజన్లో రెండు నెలల దాకా హమాలీ పని లభిస్తుందని తెలిపారు. తమపని తాము చేసుకుంటూ ప్రతి గ్రామంలో 150 మంది దాకా ఉపాధి పొందుతున్నారని చెప్పారు. ఇంతకు మించిన ఉపాధి ఏముంటుందని, ఉపాధి అంటే ఇదేనన్నారు. అయితే ఈ వ్యాఖ్య‌లు మీడియాలో ప్ర‌ముఖంగా రావ‌టం..దీనిపై దుమారం రేగ‌టంతో త‌ర్వాత మంత్రి నిరంజ‌న్ రెడ్డి ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఉపాధి అవకాశాలు పెంచిందని, ఏ ప్రభుత్వమూ ప్రతి కుటుంబానికి, ప్రతి ఒక్కరికీ ఉద్యోగం కల్పించలేదని, ఉద్యోగం అంటేనే ఉపాధి అని అది కల్పించడం ప్రభుత్వ విధి అని మంత్రి అన్నారు. ఈ వ్యాఖ్యలను పలు మీడియా సంస్థలు వక్రీకరించి నిరుద్యోగులను హమాలీ పని చేసుకోమన్నారని ప్రచారం చేయడం పట్ల విచారం వ్యక్తం చేశారు. పత్రికలు, టీవీలు, ప్రసార సాధనాలు సంచలానాల కోసం కాకుండా వాస్తవాలు, వాస్తవంగా ప్రజలకు సాధ్యమయ్యేవి ప్రజల దృష్టికి తీసుకు వెళ్లాలని ఆకాంక్షించారు. తను మాట్లాడిన మాటలను వక్రీకరించటం స‌రికాద‌న్నారు.

Tags:    

Similar News