అధికార టీఆర్ఎస్ పై బిజెపి సంచలన వ్యాఖ్యలు చేసింది. వైఎస్ షర్మిలను అడ్డంపెట్టుకుని వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోందని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్ వీ ఎస్ ప్రభాకర్ ఆరోపించారు. ఆయన ఆదివారం నాడు మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్, ఎంఐఎంతోపాటు షర్మిల పార్టీతో కూడా లోపాయికారీ ఒప్పందం చేసుకుందని విమర్శించారు. పీ వీ ఫోటోను వాడుకుని మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆమె కుమార్తెను సురభి వాణిని గెలిపించుకున్నారని, ఇప్పుడు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిలను అడ్డం పెట్టుకుని వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు ప్రయత్నిస్తోందని సంచలన ఆరోపణలు చేశారు.
కాంగ్రెస్ నేతలు కూడా టీఆర్ఎస్ తో కుమ్మక్కు అయ్యారన్నారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ నేత జానారెడ్డిని గెలిపించేందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో చిన్నారెడ్డి, రాములు నాయక్ లను బలిపశువులను చేశారన్నారు. పసుపు బోర్డు వివాదంపై కూడా ఆయన స్పందించారు. సుగంధ ద్రవ్యాల ప్రాంతీయ ఎక్స్ టెన్షన్ బోర్డు తో రైతులకు మంచి ధర వస్తుందని..రైతులు తమకు బోర్డే కావాలని అంటే కేంద్రంతో మాట్లాడతామన్నారు.