ఈటెల రాజేందర్ వర్సెస్ టీఆర్ఎస్ రాజకీయ రగడ కొనసాగుతూనే ఉంది. సోమవారం నాడు మెదక్ కలెక్టర్ హరీష్ ఈటెల కుటుంబానికి చెందిన జమునా హ్యాచరీస్ 70 ఎకరాలు కబ్జా చేసిన మాట నిజమే అంటూ మీడియా ముందుకు వచ్చారు. దీనిపై ఈటెల జమునతోపాటు రాజేందర్ కూడా స్పందించారు. కలెక్టర్ పై కేసు పెడతామనని..తాము ఎలాంటి కబ్జాలకు పాల్పడలేదని స్పష్టం చేశారు. తాము భూమిని కొనుగోలు చేశామని..అది కూడా ధరణిలోనే ఉందన్నారు. అయితే కలెక్టర్ వెల్లడించిన వివరాలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, ముఠా గోపాల్ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్ లు మంగళవారం నాడు మీడియాతో మాట్లాడారు. వీరు ఈటెల రాజేందర్, జమునల తీరును తప్పుపట్టారు.
ఈటెల రాజేందర్ భార్య జమున హ్యాచరిస్ పైన మెదక్ కలెక్టర్ మాట్లాడారని, ప్రభుత్వ, ఎస్సీ, ఎస్టీ భూములను కబ్జా చేశారని కలెక్టర్ తేల్చారన్నారు. నీతి నిజాయితీ ఉంది అంటున్న ఈటల రాజేందర్ 70 ఎకరాల భూములను ఏ విదంగా కబ్జా చేశారని ప్రశ్నించారు. ఇప్పటికైనా దబాయింపులు ఆపి..తప్పైందని ఈటల ముక్కు నేలకు రాయాలన్నారు. ఇప్పటికైనా హుజురాబాద్ ప్రజలు ఈటల తీరును గమనించాలని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ భూములు ప్రభుత్వానికి, పేదల భూములు పేదవారికి ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నామని, రాబోయే రోజుల్లో చట్టపరమైన చర్యలు తప్పకుండా ఉంటాయన్నారు.
.