ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి సభలో ముఖ్యమంత్రి కెసీఆర్ పై చేసిన టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విమర్శలపై అధికార టీఆర్ఎస్ విరుచుకుపడింది. మాజీ మంత్రులు..ఎమ్మెల్యేలు..ఇతర నేతలు రేవంత్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మాజీ మంత్రి ,ఎమ్మెల్యే జోగు రామన్న ,ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్ ,తెలంగాణ డైరీ కార్పొరేషన్ చైర్మన్ లోక భూమా రెడ్డి లు టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఇంద్రవెల్లి సభ తో రేవంత్ నీచ ,నిజ స్వరూపం బయట పడిందని విమర్శించారు. తెలంగాణ ఏర్పడ్డాకే కొమరం బీమ్ ప్రాధాన్యత పెరిగిందని, ప్రత్యేకంగా కొమురం భీం జిల్లాను ఏర్పాటు చేశామన్నారు. గిరిజనులు ,ఆదివాసీలు తలెత్తుకుని బతికేలా చేసింది టీ ఆర్ ఎస్ అయితే మోసం చేసింది కాంగ్రెస్ అని ఆరోపించారు. తండాలను ,గూడేలను గ్రామపంచాయతీలు గా మారుస్తామని కాంగ్రెస్ మోసం చేస్తే దాన్ని అమలు చేసింది టీ ఆర్ ఎస్ ప్రభుత్వం అని తెలిపారు.
దురంహకారంతో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని, గాంధీ భవన్ నుంచి ఈడ్చుకుంటూ తీసుకెళ్లి మళ్లీ నీకు చిప్పకూడు తినిపిస్తారని హెచ్చరించారు. ఇంద్రవెల్లి సభ సామర్ధ్యం 20 వేలకు మించి ఉండదన్నారు. ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య ,సైది రెడ్డి ప్రెస్ కూడా ఇదే అంశంపై మీడియాతో మాట్లాడారు. ఇంద్రవెల్లి సభ ను రేవంత్ తన నోటి దురుసుతనం ప్రదర్శించేందుకు పెట్టుకున్నారన్నారు. సీఎం కెసిఆర్ పై రేవంత్ వాడిన భాష ను చూసి కాంగ్రెస్ నేతలే సిగ్గుపడుతున్నారని విమర్శించారు. రేవంత్ డబ్బు సంచులతో రాజకీయం చేయాలని చూస్తున్నారని, దళితులను రేవంత్ చిన్న చూవు చూస్తారని ఆరోపించారు. రేవంత్ లాంటి దుర్మార్గుడిని తెలంగాణ సమాజం సహించదని వ్యాఖ్యానించారు.
.