తెలంగాణలో సాగుతున్న ధాన్యం కొనుగోలు వివాదంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ దుమారం రేపుతోంది. రాహుల్ గాంధీ అలా ట్వీట్ చేశారో లేదో..అధికార టీఆర్ఎస్ నేతలు వరస పెట్టి ఎటాక్ ప్రారంభించారు. మధ్యలో వీరికి టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ పై ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ వేదికగానే స్పందించారు. 'మీరు ఎంపిగా ఉండి రాజకీయ లబ్ది కోసం ట్విట్టర్‌లో సంఘీభావం తెలపడం కాదు.. మీకు నిజాయతీ ఉంటే తెలంగాణ ఎంపీలకు మద్దతుగా వెల్‌లోకి వచ్చి నిరసన తెలపండి. ఒకే దేశం ఒకే సేకరణ విధానం కోసం డిమాండ్ చేయండి. ధాన్యం కొనుగోలుపై పంజాబ్, హర్యానాకు ఒక నీతి.. ఇతర రాష్ట్రాలకు ఒక నీతి ఉంది' అంటూ కవిత ట్వీట్ చేశారు. కవిత ట్వీట్ పై స్పందించిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్.... టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్‌లో పోరాడటం లేదని… సెంట్రల్ హాల్లో కాలక్షేపం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. 'ఇకపై ఎఫ్‌సీఐకి బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని మీ తండ్రి కేసీఆర్ గత ఆగస్టులోనే ఒప్పందంపై సంతకం చేశారు. మీ తండ్రి నాడు చేసిన సంతకం నేడు తెలంగాణ రైతుల మెడకు ఉరితాడైంది. ఈ వాస్తవాన్ని మీరు మర్చిపోయారు'' అంటూ పోస్టు చేశారు.
రాహుల్ ట్వీట్ పై మంత్రి హరీష్ రావు కూడా స్పందించారు. తెలంగాణపై మీ దొంగప్రేమ, మొసలికన్నీరు ఆపండి అంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజల మేలు కోరే వారు అయితే పార్లమెంట్ లో తమ ఎంపీలతో కలసి రాహుల్ గాంధీ కూడా ఆందోళన చేయాలన్నారు. రైతుల ఉసురుపోసుకుంటున్న కేంద్రం తీరును ఎండగట్టే ప్రయత్నం చేయాలన్నారు. అదే సమయంలో ఒకే దేశం..ఒకే సేకరణ విధానంపై కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏంటో కూడా చెప్పాలని డిమాండ్ చేశారు. రైతుల విషయంలో రాజకీయాలు చేసి తెలంగాణ సమాజంలో పరువు తీసుకోవద్దని హరీష్ రావు వ్యాఖ్యానించారు. తొలుత ఈ అంశంపై రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ ఇలా ఉంది. ''ధాన్యం కొనుగోలు విషయంలో టీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాలు తమ నైతిక బాధ్యతను విస్మరిస్తున్నాయి. రైతుల శ్రమతో రాజకీయం చేయడం సిగ్గుచేటు.. రైతు వ్యతిరేక విధానాలతో అన్నం పెట్టే రైతన్నను క్షోభ పెట్టే పనులు మాని, పండించిన ప్రతి గింజ కొనాలి.. తెలంగాణలో పండించిన చివరి గింజ కొనే వరకు రైతుల పక్షాన కాంగ్రెస్ కొట్లాడి తీరుతుంది'' అంటూ పేర్కొన్నారు.