మోడీకి సీఎం కెసీఆర్ లేఖ‌

Update: 2022-01-12 14:26 GMT

రైతుల అంశాలే అస్త్రంగా కేంద్రంతో తెలంగాణ స‌ర్కారు విమ‌ర్శ‌లు ఎక్కుపెడుతోంది. నిన్న‌మొన్న‌టి వ‌ర‌కూ ధాన్యం సేక‌ర‌ణ అంశంపై కేంద్రంపై తీవ్ర విమ‌ర్శ‌లు చేసిన సీఎం కెసీఆర్ తాజాగా ఎరువుల అంశాన్ని చేప‌ట్టారు. పెంచిన ఎరువుల ధ‌ర‌ల‌ను వెంట‌నే త‌గ్గించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. ఈ మేర‌కు బుధ‌వారం నాడు ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ రాశారు. ఇప్ప‌టికే పెట్రో ధరల పెరుగుదల రైతులకు ఇబ్బందిగా మారిందన్నారు. ఇప్పుడు అద‌నంగా ఎరువుల భారం వేయ‌టం స‌రికాద‌న్నారు. పెంచిన ఎరువుల ధరలు తగ్గించేంతవరకు పోరాటం చేస్తామని కేసీఆర్‌ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని ప్రకటించారు. వ్యవసాయ ఖర్చులు రెట్టింపు చేయడం దుర్మార్గమన్నారు.

రైతుల ఆదాయాన్ని 2022 నాటికి రెట్టింపు చేస్తామని ప్రకటించారని, అమలులో మాత్రం రైతాంగం నడ్డి విరుస్తున్నారని లేఖలో కేసీఆర్ ఆరోపించారు. రైతు ప్రయోజనాలకు ప్రతికూలంగా ఉన్న కొన్ని విషయాలను మీ దృష్టికి తీసుకువస్తున్నానని ఆయన త‌న లేఖలో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆరు సంవత్సరాలలో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తాన‌ని ప్ర‌క‌టించింద‌ని, ఈ విషయాన్ని ఫిబ్రవరి 2016లో ప్రకటించిందనే విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పటికీ 5 సంవత్సరాలు గడిచిన నిర్దిష్ట నిర్మాణత్మక కార్యక్రమం ప్రారంభించలేదన్నారు. ఐదు ఏళ్లల్లో ఇన్‌పుట్ ఖర్చులు పెరిగి ఆదాయం తగ్గి రైతులను ఇబ్బంది పెడుతున్నాయన్నారు. ప‌లు ర‌కాల ఎరువుల ధ‌ర‌లు 50 నుంచి 100 శాతం మేర పెరిగాయ‌న్నారు.

Tags:    

Similar News