ఉద్ధ‌వ్ ఠాక్రేతో కెసీఆర్ కీల‌క భేటీ

Update: 2022-02-20 11:22 GMT

కేంద్రంలోని మోడీ స‌ర్కారుపై తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధ‌మైన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత‌, ముఖ్య‌మంత్రి కెసీఆర్ అందుకు తొలి అడుగు వేశారు. ఇందులో భాగంగా ఆయ‌న ఆదివారం నాడు ముంబ‌య్ లో మ‌హారాష్ట్ర సీఎం ఉద్ద‌వ్ ఠాక్రేతో స‌మావేశం అయ్యారు. త్వ‌ర‌లోనే ప‌లు రాష్ట్రాల నేత‌ల‌తో హైద‌రాబాద్ లో స‌మావేశం ఏర్పాటు చేయ‌బోతున్నారు. ఇందుకు ఉద్ధ‌వ్ ఠాక్రేతోపాటు బిజెపియేత‌ర పాలిత సీఎంలు, ఇత‌ర రాజ‌కీయ నాయ‌కుల‌ను ఆహ్వానించాల‌ని నిర్ణ‌యించారు. మ‌హారాష్ట్ర సీఎం ఠాక్రేతో స‌మావేశం అనంత‌రం ఇద్ద‌రు సీఎంలు క‌ల‌సి మీడియా ముందుకు వ‌చ్చారు. కేంద్రంలోని స‌ర్కారు తీరు స‌రిగాలేద‌ని..ఇది మారాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు కెసీఆర్, తెలంగాణ‌, మ‌హారాష్ట్ర లు సోద‌ర రాష్ట్రాలు అన్నారు. దేశంలోని యువ‌త‌తోపాటు ప‌లు వ‌ర్గాల‌కు మెరుగైన సౌక‌ర్యాలు క‌ల్పించేందుకు అంద‌రం క‌ల‌సి ముందుకు సాగాల్సిన అస‌వ‌రం ఉంద‌ని గుర్తించిన‌ట్లు తెలిపారు.

రాబోయే రోజుల్లో ఇత‌ర ప్రాంతీయ పార్టీల నేత‌ల‌తో చ‌ర్చ‌లు జ‌ర‌పన‌నున్న‌ట్లు తెలిపారు. దేశంలో మార్పులు తెచ్చేందుకు తాము అంతా క‌ల‌సి ప‌నిచేస్తామ‌న్నారు. చ‌త్ర‌ప‌తి శివాజీ స్పూర్తితో ముందుకు సాగుతామ‌న్నారు. ఆదివారం ఉద‌యమే కెసీఆర్ ప్ర‌త్యేక విమానంలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీల‌తో క‌ల‌సి ముంబ‌య్ బ‌య‌లుదేరి వెళ్ళారు. ఉద్థ‌వ్ ఠాక్రే అధికారిక నివాసంలో లంచ్ అనంత‌రం ఇద్ద‌రు నేత‌లు ప్ర‌త్యేకంగా స‌మావేశం అయ్యారు. రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాలు ముగిసిన తర్వాత మమతా బెనర్జీతో, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌తో మరోసారి కేసీఆర్‌ భేటీ అయ్యే అవకాశముంది. ఉద్ధవ్‌తో భేటీ అనంతరం జాతీయ రాజకీయాల్లో మరింత కీలకంగా పనిచేసేందుకు కేసీఆర్‌ ఇప్పటికే రూట్‌మ్యాప్‌ సిద్ధం చేసుకున్నట్లు పార్టీ నేత‌లు చెబుతున్నారు. ఉద్ధ‌వ్ తో భేటీ అనంత‌రం ఎన్సీపీ అధినేత శ‌ర‌ద్ ప‌వార్ తోనూ కెసీఆర్ స‌మావేశం అయ్యారు.

Tags:    

Similar News