తీన్మార్ మల్లన్న. ఇక బిజెపి నాయకుడు. ఆయన మంగళవారం నాడు ఢిల్లీలో బిజెపి కండువా కప్పుకున్నారు. తెలంగాణ బిజెపి వ్యవహారాల ఇన్ ఛార్జి తరుణ్ చుగ్ సమక్షంలో ఆయన బిజెపిలో చేరి సభ్యత్వం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బిజెపి ప్రెసిడెంట్ బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అరవింద్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం తీన్మార్ మల్లన్నను ఎన్నో రకాలుగా వేధించిందని..అన్నింటిని తట్టుకుని ఆయన నిలబడ్డారన్నారు బండి సంజయ్.
తెలంగాణ ప్రభుత్వంపై తామంతా కలసి పోరాడతామన్నారు. కొద్ది రోజుల క్రితం జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న పెద్ద సంచలనంగా మారారు. అప్పటికే ఆయన తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలంగాణలో ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆ తర్వాత తెలంగాణ సర్కారు ఆయనపై పలు కేసులు పెట్టడంతో జైలు జీవితం కూడా గడపాల్సి వచ్చింది.