తెలుగుదేశం పార్టీ మహానాడు తర్వాత రాజకీయ కార్యకలాపాల జోరు పెంచాలని నిర్ణయించింది. ఈ దిశగా ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. గత ఎన్నికల్లో ఓటమి, కరోనా కారణంగా గత కొన్ని సంవత్సరాలుగా మహానాడు జరగలేదు. ఈ సారి మహానాడును ఒంగోలులో జరపాలని నిర్ణయించారు. మహానాడు తర్వాత రాష్ట్రమంతా తాను పర్యటించనున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తెలిపారు. ఆయన మంగళవారం నాడు పార్టీ కార్యాలయంలో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. 'ప్రభుత్వంపై ఈ స్థాయి ప్రజా వ్యతిరేకత లేదు చరిత్రలో చూడలేదు. ప్రభుత్వాలు విఫలం అవ్వడం వేరు...పాలనపై ఈ స్థాయి అసంతృప్తి వేరు. టిడిపి అత్యధిక సీట్లు గెలిచిన 1994లో కూడా ప్రజల్లో నాటి ప్రభుత్వంపై ఇంత వ్యతిరేకత లేదు. జగన్ ప్రభుత్వ విధానాలతో ప్రజల జీవన ప్రమాణాలు దారుణంగా దెబ్బతిన్నాయి. జగన్ పథకాలు వెనుక ఉన్న లూటీ ప్రజలు గుర్తించారు...తాము ఏం నష్టపోయామో వారికి తెలుస్తుంది. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడానికి సంక్షేమ పథకాలు కారణం కాదు...జగన్ లూటీ వల్లనే ఈ దుస్థితి. ప్రభుత్వానికి ఆదాయం వచ్చే మార్గాలను దెబ్బతీసి జగన్ తన ఆదాయం పెంచుకుంటున్నాడు. మద్యం పై బహిరంగ దోపిడీ జరుగుతుంది...ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం వ్యక్తుల జేబులోకి వెళుతుంది. మైనింగ్, ఇసుక ను సంపూర్ణంగా దోచుకుంటున్నారు....ఈ భారం ప్రజపైనే పడుతుంది. రైతు వర్గంలో ఒక్క ఓటు కూడా ఇక వైసిపికి పడే చాన్స్ లేదు.రైతులకు ఏడాదికి 7 వేలు ఇచ్చి...ఇతరత్రా వారిని పూర్తిగా విస్మరించారు.
రాజకీయాల్లో వర్గ ద్వేషాలు ఉండకూడదు....కొన్ని వర్గాలను టార్గెట్ చేసుకోవడం ఎప్పుడూ చూడలేదు. పవన్ పై కోపంతో ఒక సామాజికవర్గాన్ని, టిడిపిపై కోపంతో మరో వర్గాన్ని, రఘరామకృష్ణం రాజుపై కోపంతో మరో వర్గాన్ని టార్గెట్ చేశారు. వైసిపి ఇప్పుడు ఓడిపోతే మళ్లీ జీవితంలో అధికారంలోకి రాదు అనేదే జగన్ ఫ్రస్టేషన్ కు కారణం. జగన్ ఫ్రస్టేషన్ లోనే అతని భాషమారింది.....క్యాబినెట్ విస్తరణ తో జగన్ బలహీనుడు అని తేలిపోయింది. ఒత్తిళ్లతో సగంమందిని క్యాబినెట్ లో తిరిగి కొనసాగించారు.....దీంతో బయట తిరుగుబాట్లు మొదలయ్యాయి.క్యాబినెట్ విస్తరణ అనంతరం బ్రతిమిలాడుకోవాల్సిన పరిస్థితి రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రికి రాలేదు. భవనం వెంకట్రామ్ కు కూడా ఇంత బలహీనంగా కనిపించలేదు. నా ఇంటి మీద దాడికి వచ్చిన వారికి....లోకేష్ ను దూషించిన వారికి మంత్రి పదవులు ఇచ్చారు. మంత్రి పదవులు పొందడానికి ఇదేనా అర్హత.ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకుంటుంన్నాం. బాదుడే బాదుడు పేరుతో టిడిపి చేస్తున్న పోరాటం లో ను పాల్గొంటాను...మహానాడు వరకు బాదుడే బాదుడు కార్యక్రమం ఉంటుంది. మే మొదటి వారం నుంచి నా పర్యటనలు మొదలు అవుతాయి. మహానాడు తరువాత రాష్ట్ర వ్యాప్తంగా విస్త్రృతంగా పర్యటనలు చేపడతాను. నెలకు రెండు జిల్లాల చొప్పున ఏడాదిలో అన్ని జిల్లాల పర్యటన పూర్తి చేస్తాను.' అని వెల్లడించారు.