కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ పలు వాయిదాల అనంతరం గురువారం నాడు ఢిల్లీలో నేషనల్ హెరాల్డ్ పత్రిక మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ (ఈడీ) అధికారుల ముందు హాజరయ్యారు. సోనియాతో ఆమె కుమార్తె ప్రియాంక గాంధీ కూడా ఉన్నారు. రాహుల్ గాంధీ కూడా ఈడీ కార్యాలయానికి వచ్చి తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు. యూపీఏ హయాంలో దేశంలోనే అత్యంత శక్తివంతమైన నాయకురాలుగా ఉన్న ఆమె ఇప్పుడు విచారణ సంస్థల ముందు హాజరు కావటం ఇదే మొదటిసారి. కొద్ది రోజుల క్రితమే రాహుల్ గాంధీని గంటలకు గంటలు విచారించిన ఈడీ ఇప్పుడు ఇదే కేసులో సోనియా నుంచి సమాచారం రాబట్టనుంది. సోనియాగాంధీకి ఈడీ నోటీసులు జారీ చేయటాన్ని దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ నిరసనలకు పిలుపునిచ్చింది.
ఢిల్లీలోనూ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం దగ్గర కీలక నేతలు అందరూ హాజరై నిరసనలకు రెడీ అయ్యారు. అయితే పోలీసులు మాత్రం నిరసనలకు అనుమతి లేదని కాంగ్రెస్ నేతలను అడ్డుకున్నారు. కేంద్రంలోని మోడీ సర్కారు విచారణ సంస్థలను రాజకీయ వేధింపులకు వాడుకుంటున్నాయని కాంగ్రెస్ తోపాటు పలు పార్టీలు మండిపడ్డాయి. ఇదే అంశంపై ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం నిర్వహించి ఓ ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. సోనియాగాంధీ ఈడీ విచారణకు హాజరు అవుతున్న తరుణంలో ఈ సమావేశం జరగటం ఓ విశేషం అయితే..ఈ సమావేశంలో తెలంగాణకు చెందిన అధికార టీఆర్ఎస్ కూడా పాల్గొనటం కీలక పరిణామం.