ఏపీ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు ఒక్క రోజులోనే మాట మార్చారు. గురువారం నాడు తాము అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తామని, వైసీపీ, టీడీపీలు ఈ మేరకు ప్రకటన చేయగలవా అంటూ సవాల్ విసిరారు. కానీ ఒక్క రోజులోనే తాను అలా అనలేదంటూ మాట మార్చారు. కొందరు తన మాటలను అలా వక్రీకరించారని చెప్పారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, తమ మిత్రపక్షం జనసేన అధినేత పవన్ కలిసి సీఎం ఎవరనేది నిర్ణయిస్తారని తెలిపారు. బీసీ అయిన మోదీని బీజేపీ ప్రధానిని చేసిందని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి గురించి ప్రకటన చేసే అధికారం తనకు లేదని అన్నారు.
ఎస్టీ, బీసీల వినతులను కేంద్రం దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. బీజేపీ సకల జనుల పార్టీ అని.. అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. దేవాలయ నిధులను వాడేసిన చంద్రబాబు ఇప్పుడు జై శ్రీరామ్ అంటున్నారని విమర్శించారు. విశాఖ ఉక్కుపై 14న ఢిల్లీ వెళ్ళి జాతీయ కమిటీని కలిసి విన్నవిస్తామని తెలిపారు. పెట్రోలు ధరలపై రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాలని అన్నారు. దేశంలోని అన్ని ఫ్యాక్టరీల పైన విధానపరమైన నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. పెట్రోల్‌పై విధించే సెస్‌ను రాష్ట్రాలు తగ్గించుకోవాలని సూచించారు.