ఏపీ బిజెపి ప్రెసిడెంట్ సోము వీర్రాజు చిక్కుల్లో పడినట్లే కన్పిస్తోంది. ఒక్క కామెంట్ తో ఆయన జాతీయ స్థాయిలో బిజెపిని సమస్యల్లో పడేశారు. ఏపీలో మద్యం తాగే కోటి మంది తమ పార్టీకే ఓటు వేయాలని..తాము అధికారంలోకి వస్తే చీప్ లిక్కర్ 70 రూపాయలకు..ఆదాయం బాగుంటే 50 రూపాయలకే అందిస్తామని ప్రకటించి కలకలం రేపారు. సోము వీర్రాజు వ్యాఖ్యలపై రాజకీయంగా పెద్ద దుమారం రేగింది. తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటీఆర్ కూడా ఇదే అంశంపై ఘాటు వ్యాఖ్యలతో ట్వీట్ చేశారు. ఇక సోషల్ మీడియాలో అయితే సోము వీర్రాజు మద్యంపై చేసిన కామెంట్లకు సంబంధించి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే మంగళవారం నాడు ప్రజాగ్రహ సభ ముగిసిన వెంటనే ఏపీ బిజెపి నేతలు సోము వీర్రాజు తీరును తీవ్రంగా తప్పుపట్టారు. అసలు అనుకున్నది ఏంటి?. జరిగింది ఏమిటి? చీప్ లిక్కర్ అంశాన్ని ప్రస్తావించాల్సిన అవసరం ఏముందని ప్రకాష్ జవదేకర్ సమక్షంలోనూ..ఆయన వెళ్లిన తర్వాత కూడా విజయవాడలోని ఓ స్టార్ హోటల్ లో పార్టీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.. అంతే కాదు ఇదే అంశంపై బిజెపి అధిష్టానికి పిర్యాదు కూడా చేశారు. కన్నా లక్ష్మీనారాయణ బిజెపి ప్రెసిడెంట్ గా ఉన్న సమయంలో అధికార వైసీపీపై దూకుడుగా విమర్శలు చేసేవారు. సోము వీర్రాజు వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అందుకే తాజాగా టీడీపీ బిజెపి అంటే ఏపీలో భారతీయ జగన్ పార్టీగా మారింది అంటూ తీవ్ర విమర్శలు గుప్పించింది. బిజెపి నేతలు చాలా మంది సీఎం జగన్ రాడార్ లో పనిచేస్తున్నారంటూ ఆ పార్టీ నేత పయ్యావుల కేశవ్ వ్యాఖ్యానించారు.
విచిత్రం ఏమిటంటే టీడీపీ ఇలా అంటుంటే...అధికార వైసీపీ మాత్రం ఏపీ బిజెపి అంతా చంద్రబాబు డైరక్షన్ లోనే పనిచేస్తుందని..ప్రజాగ్రహ సమావేశం స్క్రిప్టు కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లోనే తయారైందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. మొత్తం మీద సోము వీర్రాజు వ్యవహారం బిజెపిలో పెద్ద కలకలమే రేపింది. జాతీయ మీడియా కూడా సోము వీర్రాజు వ్యాఖ్యలను హైలెట్ చేస్తూ కథనాలు ప్రసారం చేయటంతో ఆయన పదవికి ముప్పు పొంచి ఉందనే వ్యాఖ్యలు కూడా విన్పిస్తున్నాయి. మరి ఇది టీ కప్పులో తుఫానుగా మారిపోతుందా? లేక ఆయన పదవికే ఎసరు తెచ్చిపెడుతుందా అన్నది కొద్ది రోజులు పోతే కానీ తెలియదు. అయితే బిజెపి అకస్మాత్తుగా అధికార వైసీపీపై భారీ ఎత్తున విమర్శలు చేయటం వెనక కారణం ఏంటి?. భవిష్యత్ లోనూ ఆ పార్టీ మరింత దూకుడు పెంచబోతుందా అన్న చర్చ సాగుతోంది. బిజెపికి మిత్రపక్షంగా ఉన్న జనసేన విషయంలోనూ సోము వీర్రాజు వైఖరి సరిగా లేదని కొంత మంది బిజెపి నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇందుకు ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలను ఉదహరిస్తున్నారు. ప్రజాగ్రహ సభ ద్వారా వైసీపీ పనితీరును ఎండగట్టాలనుకున్న బిజెపినే సోము వీర్రాజు చిక్కుల్లో పడేశారనే విమర్శలు వస్తున్నాయి.