రామతీర్ధంలో సోము వీర్రాజు అరెస్ట్

Update: 2021-01-05 07:04 GMT

ఏపీ రాజకీయాలకు రామతీర్ధం ఓ వేదికగా మారింది. మంగళవారం నాడు బిజెపి, జనసేన పార్టీలు రామతీర్ధం పర్యటన తలపెట్టాయి. అయితే ఏపీ సర్కారు ముందస్తుగానే చాలా చోట్ల నేతలను అదుపులోకి తీసుకుంది. విజయనగరం జిల్లాలోని కోదండరామ దేవాలయంలో విగ్రహాల ధ్వంసానికి సంబంధించిన ఘటనపై నిరసన తెలియజేస్తూ ఇరు పార్టీలు యాత్ర చేపట్టాయి. భారతీయ జనతాపార్టీ, జనసేన కలిసి చేపట్టిన కార్యక్రమాన్ని ప్రభుత్వం నిరోధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ, జనసేన నేతలు, కార్యకర్తలను ఎక్కడికక్కడ నిర్బంధించడం జగన్ ప్రభుత్వం చేతగాని, పిరికి తనానికి నిదర్శనమని అన్నారు. చంద్రబాబు, విజయసాయి రెడ్డిలకు రామతీర్థంకు అనుమతి ఇచ్చి.. మమ్మల్ని అడ్డుకోవడం అంటే రాష్ట్రంలో హిందుత్వాన్ని కించపరిచే విధంగా ఉందని, దీన్ని ప్రభుత్వం పనికిమాలిన, పిరికి చర్యగా భావిస్తున్నానని అన్నారు. ఏది ఏమైనా శ్రీరాముడివద్దకు తప్పకుండా వెళ్లితీరతామని సోము వీర్రాజు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, బిజెపి నేతల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదాలు నడిచాయి.

Tags:    

Similar News