శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక వ్యవస్థలోకి మరో వ్యవస్థ జొరపబడటం సరికాదన్నారు. బెదిరింపులకు భయపడితే వ్యవస్థ పలుచన అవుతుందని అన్నారు. మీ సంగతి ఏంటో చూస్తామనే ధోరణిలో వ్యవహరించటం ఏ మాత్రం సరికాదన్నారు. శ్రీకాకుళం జిల్లాలో పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రమేశ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ''ఎన్నికల నిర్వహణ ఉద్యోగులకు సవాల్. నేనూ ప్రభుత్వ ఉద్యోగినే.. అయితే తప్పుడు సవాళ్లను అధిగమించాల్సిందే. శ్రీకాకుళం జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయి. ప్రతి వ్యవస్థకూ రాజ్యాంగం నిర్దిష్టమైన బాధ్యతలు అప్పగించింది. ఎన్నికల సంఘానికి రాజ్యాంగం ప్రత్యేక ప్రతిపత్తి కల్పించింది.
గత 40 సంవత్సరాల సర్వీసులో ఎప్పుడూ వివాదస్పదం కాలేదన్నారు. నేను ఎవరినీ కించపర్చలేదు. ఎప్పుడూ స్వీయ నియంత్రణే పాటించా. ప్రజా స్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలని రాజ్యాంగం చెప్పింది. రాజ్యాంగం ఏం చెప్పిందో అదే తూచా తప్పకుండా పాటిస్తున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎన్నికల సంఘంపై కేసు నమోదు చేశారు. ఎన్నికల సంఘం అధికారులపై కూడా కేసు పెట్టారు. ఇది అవాంఛనీయం. దేశంలో ఎక్కడా ఇలాంటి ఘటనలు జరగలేదు. చూస్తూ ఊరుకుంటే ఎన్నికల సంఘం పలచబడుతుంది. అందుకే కోర్టుకెళ్లాం.'' అని అన్నారు. ఏకగ్రీవాలకు సంబంధించి తనకు నిర్ధిష్టమైన అభిప్రాయం ఉందన్నారు.