కాంగ్రెస్ పార్టీలో మళ్లీ రచ్చ ప్రారంభం అయింది. ఆ పార్టీకి కాస్త వాతావరణం అనుకూలంగా మారుతుంది అంటే చాలు...వెంటనే ఎవరో ఒకరు ఎంట్రీ ఇచ్చి అది కాస్తా పూర్తిగా మైనస్ గా మార్చే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి అదే పని చేశారు. తెలంగాణలో రైతులను వరి వేయవద్దని చెప్పిన సీఎం కెసీఆర్ స్వయంగా తన ఫాంహౌస్ లోని 150 ఎకరాల్లో వరి వేశారని అంటూ రేవంత్ రెడ్డి ఆదివారం నాడు ఫోటోలు, వీడియోలను ప్రదర్శించారు. ఇది పెద్ద సంచలనంగా మారింది. ప్రత్యేకంగా ఈ విషయంలో టీఆర్ఎస్ ఎక్కడా ఖండన కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. సరిగ్గా ఈ సమయంలో జగ్గారెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ పదవి నుంచి రేవంత్ ను తప్పించాలని..లేదంటే ఆయన పార్టీ లైన్ లో అందరినీ కలుపుకునిపోయేలా చూడాలంటూ కాంగ్రెస్ అధిష్టానికి లేఖ రాశారు. కాంగ్రెస్ ప్రెసిడెంట్ సోనియాగాంధీతోపాటు ఆ పార్టీ నేత రాహుల్ కు ఆయన లేఖలు పంపారు.
కాంగ్రెస్ పార్టీలో రేవంత్ స్టార్ లీడర్ గా ఎదగాలనుకుంటున్నారని..ఆయన అందరినీ కలుపుకుని పోవటంలేదన్నారు. ఆయన పార్టీని ఓ కార్పొరేట్ ఆఫీస్ లా నడిపిస్తున్నారు తప్ప..సోనియా, రాహుల్ పార్టీలా నడపటం లేదని ఫిర్యాదు చేశారు. ఇదే అంశంపై మాట్లాడేందుకు ప్రయత్నించగా తన ఫోన్ కూడా లిప్ట్ చేయలేదన్నారు. రైతులతో రచ్చబండ వంటి కార్యక్రమం తలపెడితే దానిపై సీనియర్ నేతలతో చర్చించకుండా ఏకపక్షంగా తనకు అనుకూలంగా ఉన్నవారితో మాత్రమే కార్యక్రమం నిర్వహించేలా చేశారన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్యే అయిన తనకు కూడా దీనిపై సమాచారం ఇవ్వలేదని జగ్గారెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు రేవంత్ రెడ్డితో ఎలాంటి విభేదాల లేవని..పార్టీ మేలు కోసమే ఈ లేఖ రాస్తున్నట్లు తెలిపారు. అందరినీ కలుపుకుని పోయే వ్యక్తిని పీసీసీ ప్రెసిడెంట్ గా నియమించాలని కోరారు.