టీపీసీసీ ప్రెసిడెంట్, కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అధికార టీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు చేశారు. రైతులను మోసం చేసేందుకే ఆ పార్టీ ఎంపీలు పార్లమెంట్ లో డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. పార్లమెంట్ లోపల ఓ పదిహేను నిమిషాలు..గాంధీ విగ్రహం వద్ద ఓ పది నిమిషాలు ప్లకార్డులు పట్టుకుని షో చేస్తున్నారని విమర్శించారు. తర్వాత విరామ సమయంలో అందరూ కూర్చుని పిచ్చాపాటి మాట్లాడుకునే సెంట్రల్ హాల్ లో ఫోటోలు దిగి ఉద్యమం చేస్తున్నామని చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మరి వాళ్ల నాయకుడే ఆ డ్రామా చేయమన్నారో లేక ఎంపీలే ఇలా చిల్లరగా చేస్తున్నారో తెలియదన్నారు. పార్లమెంట్ జరుగుతున్నప్పుడు సీఎం కెసీఆర్ నిరసన తెలపటానికి ఎందుకు ఢిల్లీకి రావటం లేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఢిల్లీకి వచ్చి ప్రధానిని, సంబంధిత శాఖ మంత్రిని ఎందుకు నిలదీయటంలేదన్నారు. రైతుల కోసం ఢిల్లీలో యుద్ధం చేస్తా..నరేంద్రమోడీ మెడలు వంచుతా అన్న కెసీఆర్ ఈ రోజు ప్రగతిభవన్ లో పడుకున్నాడా...పాంహౌస్ లో నిద్రపోతున్నాడా అని ప్రశ్నించారు.
కేంద్రాన్ని నిలదీయాల్సిన కెసీఆర్ ఎందుకు ఢిల్లీ రావటంలేదన్నారు. టీఆర్ఎస్ ఎంపీల నాటకంతో రైతుల వరి ధాన్యం సమస్య పరిష్కారం కాదన్నారు. కేంద్రంతో లాలూచీ పడి కెసీఆర్ రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. మంత్రి నిరంజన్ రెడ్డి తాము బ్రోకర్లం అని ఒప్పుకున్నారని వ్యాఖ్యానించారు. ఈ పని చేయటానికి ప్రభుత్వం ఎందుకు ముఖ్యమంత్రి, మంత్రులు ఎందుకు అని మండిపడ్డారు. చనిపోయిన రైతులను ఆదుకోవాలన్నారు. కనీసం ప్రతి రైతు కుటుంబానికి పది లక్షల రూపాయల ఆర్ధిక సాయం అందించాలన్నారు. మొలకెత్తిన ధాన్యాన్ని కూడా వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. టార్గెట్ పెట్టిన వరి ధాన్యం మొత్తం కొనాలన్నారు. రైతులకు సంబంధించి తమ పోరాటాన్ని ఢిల్లీకి మారుస్తామన్నారు.