ప్రధాని నరేంద్రమోడీపై టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీ చేతిలో మోసపోని వాళ్లు ఎవరైనా ఉన్నారా? అని ఆయన ప్రశ్నించారు. ' లోక్ సభలో సుష్మా స్వరాజ్ తెలంగాణ బిల్లుపై చర్చ లేకుండానే ఆమోదం తెలపాలన్నారు. అసలు చర్చే అవసరం లేదన్నారు. రాజ్యసభలో ఆ రోజు ఉన్న నేత అరుణ్ జైట్లీ ఏమి మాట్లాడారో తెలుసుకో. నీ మాటలు విని స్వర్గంలో ఉన్న అరుణ్ జైట్లీ ఆత్మ ఘోషిస్తుంది. అరుణ్ జైట్లీ అంటే చనిపోయారు. మీకు తెలియకపోతే ఇప్పుడు రాజ్యసభ ఛైర్మన్ గా ఉన్న వెంకయ్యనాయుడు రాజ్యసభలో ఏమి జరిగిందో అడిగి తెలుసుకో. అప్పుడు సుష్మా స్వరాజ్ కు చెక్ పెట్టేందుకే నిర్మలా సీతారామన్ కు కీలక బాధ్యతలు అప్పగించావు. అద్వానీని పక్కకు తప్పించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలను వంచించావు.. తిరుపతిలో నువ్వు పొర్లుడు దండాలు పెట్టే వెంకటేశ్వరస్వామి సాక్షిగా 2014 ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానని దేవుడి సాక్షిగా చెప్పి దేవుడికే శఠగోపం పెట్టిన మహానుభావుడు..ప్రబుధ్ధిడివి నువ్వు. హోదా ఇవ్వకుండా ఏపీని సంకనాకించావు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వనందుకు మోడీ తలవంచుకోవాలి.
తెలంగాణకు పునర్విభజన చట్టంలో బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్శిటీ, ఎన్టీపీసీ ద్వారా 4000 మెగావాట్ల విద్యుత్ యూనిట్ ఏర్పాటు, ఐటిఐఆర్ ఇస్తామని కాంగ్రెస్ ప్రకటిస్తే అన్నింటిని తుంగలో తొక్కి..మోసం చేసింది మోడీనే. ఇంత కంటే సిగ్గులేని ప్రధాన మంత్రి దేశానికి ఉండటం అవసరమా?. ఇలాంటి ప్రధాన మంత్రులు బంగాళఖాతంలో దూకి ఆత్మహత్య చేసుకోవాలి. బండిని, గుండును..కిషన్ రెడ్డిని అడుగుతున్నా. నరేంద్రమోడీ వ్యాఖ్యలను మీరు సమర్ధిస్తున్నారా? చెప్పాలన్నారు. ఇంత పనికి మాలినోడు ప్రధానిగా ఉంటే నీకు మంత్రి పదవి అవసరమా?. కిషన్ రెడ్డి తన మంత్రి పదవికి రాజీనామా చేయాలి. తెలంగాణాను, తెలంగాణ జాతిని అవమానిస్తే మీరు స్పందించారా?. దుష్టచతుష్టయం గుజరాత్ నుంచి బయలుదేరారు. అదానీ, అంబానీ, మోడీ, అమిత్ షాలు ..వీళ్ళకు సెంటిమెంట్లు ఏమీ ఉండవు. కడుపు నింపుకోవాలి..పోవాలి అన్నారు. ఈ దుష్టచతుష్టయం దేశాన్ని కొల్లగొట్టి ఈస్ట్ ఇండియా కంపెనీలా దేశాన్ని ఆక్రమించాలని చూస్తున్నారు' అంటూ మండిపడ్డారు.
గుజరాత్ నుంచి వచ్చిన మోడీకి తెలంగాణ ప్రజలు త్యాగాలు ఎలా తెలుస్తాయని అని ప్రశ్నించారు. మోడీ కుసంస్కారి..అజ్ణాని.. ఏ మాత్రం సంస్కారం లేకుండా మాట్లాడుతున్నాడు. ఏ హోం మంత్రి అయినా ప్రధాన మంత్రికి తెలియకుండా పనిచేస్తారా?. అసలు సర్దార్ వల్లబాయ్ పటేల్ కు మీకు సంబంధం ఏమిటి అని ప్రశ్నించారు. హోం మంత్రి అమిత్ షా ఏమి చేసినా..మోడీ చెప్పినట్లే చేస్తున్నా అంటున్నాడు..మరి అప్పుడు పటేల్ ప్రదానికి తెలియకుండానే సైనిక చర్యతోపాటు ఇతర నిర్ణయాలు తీసుకున్నారా? అని ప్రశ్నించారు. అసలు ఏమీ తెలియని మోడీకి కింద మీరు అంతా ఎలా పనిచేస్తున్నారు అంటూ మండిపడ్డారు. మళ్లీ తెలంగాణలో సెంటిమెంట్ రాజేసి జాకీలు వేసి కెసీఆర్ ను లేపాలని చూస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. జాకీలు కాదు..మోటార్లు పెట్టినా కూడా కెసీఆర్ లేవటం సాధ్యంకాదన్నారు. సోనియా గాంధితోపాటు కాంగ్రెస్ పార్టీ అనేక త్యాగాలు చేసి తెలంగాణ ఇస్తే... ఇంత దిగజారుడు వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని అన్నారు.