తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి మరోసారి సీఎం కెసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్, ప్రధాని మోదీ ఒడిలో కూర్చుని రైతులను దగా చేస్తున్నారని విమర్శించారు. గత ఆరేళ్లలో తెలంగాణలో 6380 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని..ఇవి ఎన్ సీ ఆర్ బీ నివేదికే వెల్లడిస్తోందని తెలిపారు. రైతు బంధు పేరు చెప్పి మిగతా అన్ని స్కీమ్ లు ఎత్తేశారని విమర్శించారు. వ్యవసాయ బడ్జెట్లో పది వేల కోట్ల రూపాయలు పెట్టి దారిమళ్ళిస్తున్నారని, ఇన్ పుట్ సబ్సిడీకి మంగళం పాడారన్నారు. కాళేశ్వరంలో అవినీతిపై బిజెపి మాటలే తప్ప, చేతలకు ఏ మాత్రం సిద్ధపడదని ధ్వజమెత్తారు. విద్యుత్ కొనుగోళ్ళలో కోట్ల కుంభకోణం అని ఆరోపించిన బిజెపి చర్యలు ఎందుకు తీసుకోదని ప్రశ్నించారు. నిజామాబాద్ జిల్లాలో జరిగిన పసుపు రైతు దీక్షా సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. పసుపు బోర్డు పెడతానన్న బోడ గుండోడు ఏడికి పోయిండని ఎంపీ అర్వింద్‌ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. ''నీ పేరులోనే ధర్మం ఉంది కానీ చేసేదంతా అధర్మమే. అర్వింద్‌ను గెలిపిస్తే పసుపు బోర్డు తెస్తానన్న బీజేపీ నేత రాంమాధవ్ హామీ ఏమైంది?. అర్వింద్ బాల్య వితంతువుగా మారుతావా?. రైతులతో ఇలాగే వ్యవహరిస్తే నీ రాజకీయ భవిష్యత్తును బొంద పెడతారు. ఎంపీ బండి సంజయ్‌కు రైతుల గోస కనిపించడం లేదా?. తెలంగాణ వచ్చాక 6358 మంది రైతు ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతు బతికుండగా సాయం చేయని కేసీఆర్ చచ్చాక 6 లక్షలు ఇస్తాడట.
పసుపు రైతులు ఢిల్లీ వీధుల్లో కదం తొక్కాలి'' అని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో చక్కెర ఫ్యాక్టరీని తెరిపిస్తానని మాట తప్పిన కవితను శంకరగిరి మాన్యాలు పట్టించిన ఘనత ఇక్కడి రైతులది అని..పసుపు బోర్డు విషయంలో మోసం చేసిన ఎంపీ అరవింద్ కు ఇదే పరిస్థితి తప్పదన్నారు. దేశంలో మోడీ, రాష్ట్రంలో కెసీఆర్ మాటలు నమ్మి రైతులు మోసపోయారని..ఈ అరాచకాలపై పోరాటానికి ఆకుపచ్చ సైన్యంగా రైతులు సిద్ధం అవుతున్నారని అన్నారు. రైతుబంధు ఇవ్వనని చెప్పి రైతులను బ్లాక్ మెయిల్ చేసి సన్నధాన్యం పండించేలా ఒత్తిడి చేసిన కెసీఆర్ తీరా పంట వచ్చాక కొనుగోలుకు కొర్రీలు వేసి రైతులను నానా తిప్పలు పెట్టారన్నారు. రైతుల విషయంలో బిజెపి, టీఆర్ఎస్ కలసి మోసం చేస్తున్నాయని ధ్వజమెత్తారు.