హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితంపై టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి స్పందించారు. ప్రత్యేక పరిస్థితుల్లో అక్కడ ఎన్నిక జరిగిందని.అయినా అందుకు బాధ్యత తానే తీసుకుంటానని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఓటమిపై కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మరింత కష్టపడి పని చేస్తామని ప్రకటించారు. మంగళ వారం నాడు జూబ్లీహిల్స్ లోని పార్లమెంట్ కార్యాలయంలో ఆయన టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హుజురాబాద్ ఉప ఎన్నిక పార్టీ కార్యకర్తలను నిరాశపరిచాయని ఒక ఉప ఎన్నిక ఫలితాల వల్ల పార్టీ కార్యకర్తలు నిరాశచెందవద్దని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బల్మూరి వెంకట్ నిరాశ చెందాల్సిన అవసరం లేదని వెంకట్ కు మంచి భవిష్యత్తు ఉందని, కాంగ్రెస్ పార్టీలో వెంకట్ మంచి నాయకుడుగా ఎదుగుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.
హుజురాబాద్ ఎన్నికల ఫలితాలపై సంపూర్ణమైన భాద్యత నాదేనని, హుజురాబాద్ లో జరిగిన పరిణామాలపై నివేదికలు తెప్పించుకొని విశ్లేషణ చేసుకుంటామని, రాబోయే రోజులన్ని కాంగ్రెస్ పార్టీవేనని అన్నారు. ఇక నుంచి ప్రజా సమస్యలపై మరింత బాధ్యతగా, నిరంతరం పోరాటం చేస్తామని అన్నారు. ఉప ఎన్నిక పార్టీ భవిష్యత్ ను నిర్ణయించలేవని, గత ఎన్నికల్లో బిజెపి కి 16 వందల ఓట్లు మాత్రమే వచ్చాయని ఇప్పుడు విజయం సాధించిందని అన్నారు. మొన్న జరిగిన నాగార్జున సాగర్ ఎన్నికలో బీజేపీ కనిపించలేదని అన్నారు.