లక్ష మందితో ఇంద్రవెల్లిలో దళిత, గిరిజన ఆత్మగౌరవ సభ నిర్వహించనున్నట్లు టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఎన్ని నిర్భంధాలు ఎదురైనా ఈ సభ లక్ష మందితో జరిపి చూపిస్తామని ప్రకటించారు. తెలంగాణలో దళిత బందు ప్రకటించినట్లుగానే గిరిజనులకు కూడా పది లక్షల రూపాయలు ఇవ్వాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆగస్టు 9 నుంచి సెప్టెంబర్ 17 వరకూ జరిగే దళిత, గిరిజన దండోరా సభల్లో ఒక రోజు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పాల్గొంటారని తెలిపారు. పోడు భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులను చెట్లకు కట్టేసి కొడుతుంటే సీఎం కెసీఆర్ కు కన్పించటంలేదా అని రేవంత్ ప్రశ్నించారు. దళిత, గిరిజన దండోరా సభకు సంబంధించిన పోస్టర్ ను రేవంత్ బుధవారం నాడు ప్రకాశం హాలులో జరిగిన కార్యక్రమంలో ఆవిష్కరించారు. దళిత బంధు రాష్ట్రం మొత్తం ఎప్పుడు ఇస్తారో చెప్పాలన్నారు. హుజూరాబాద్ లో ఓట్లు కొనుగోలు చేసేందుకే అక్కడ తొలుత అమలు చేస్తున్నారని ఆరోపించారు.
అంతకు ముందు పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశంలో రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ సమిష్టి నిర్ణయం మేరకే అన్ని పనులు జరుగుతాయన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారిని కొంతమందిని కోవర్టులుగా మార్చుకొని కేసీఆర్ రాజకీయ లబ్ది పొందిన విషయాలు చూశామని, మనం కూర్చున్న కొమ్మను మనం నరుక్కోవద్దన్నారు. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేడని చెప్పారు. పార్టీకి వ్యతిరేకంగా ఎవరు పని చేసిన కచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందేనన్నారు. రాహుల్ గాంధీతో దళిత దండోరాపై చర్చించామన్నారు. సెప్టెంబరు మొదటి వారంలో తెలంగాణకు రాహుల్ గాంధీ వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రాంతం, తేదీ ఎక్కడ, ఎప్పుడు అనేది మనం నిర్ణయించాలని సూచించారు.