టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి కెసీఆర్ దత్తత తీసుకున్న గ్రామాల్లో కూడా అభివృద్ధి శూన్యం అని ఆరోపించారు. సీఎం కెసీఆర్ దత్తత తీసుకున్న మూడు చింతలపల్లిలో త్వరలోనే దళిత, గిరిజన దీక్ష చేపడతామని వెల్లడించారు. రేవంత్ రెడ్డి ఆదివారం నాడు గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్, మోసం కవలపిల్లలుగా కనిపిస్తారంటూ విమర్శించారు. దత్తత గ్రామానికి కేసీఆర్ ఏం చేశాడో ప్రజలకు చూపిస్తాం. కేసీఆర్ పాలనలో అత్యధికంగా దోపిడీకి గురైంది దళితులే అంటూ ఆరోపించారు.
టీఆర్ఎస్, బిజెపివి కొనుగోలు రాజకీయాలన్నారు. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ అవినీతిపై కెసీఆర్ ఎందుకు మాట్లాడటంలేదని ప్రశ్నించారు. కెసీఆర్ అరాచకాలను సహించలేకే మంచి అధికారి అయిన ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారన్నారు. ప్రస్తుతం తమ ధ్యాస అంతా ప్రజా సమస్యలపై పోరాటాలపైనే ఉందన్నారు. పీసీసీ పూర్తి స్థాయి కమిటీ ఏర్పాటుకు సమయం పడుతుందని తెలిపారు.