కెటీఆర్ పై రేవంత్ రెడ్డి ఫైర్
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ మంత్రి కెటీఆర్ పై టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. బరితెగించిన కోడి బజారులో కొచ్చి గుడ్డు పెట్టింది అట. అలా ఉంది కెటీఆర్ వ్యవహారం అంటూ మండిపడ్డారు. ఓడిపోయిన వాళ్ళు సన్యాసం తీసుకోవాలంట, సిగ్గుండాలి... సొంత చెల్లెలను నిజామాబాద్ లో గెలిపించుకోలేకపోయారు. మేం ఏదైనా అంటే కోర్టుకు పోతారు. పిరికివాళ్ల గురించి ఏమి మాట్లాడతాం అంటూ ప్రశ్నించారు. తాను ఏదైనా సవాల్ విసిరితే నా స్థాయి కాదు అంటారు. రాజకీయంగా ఆయన కంటే తానే సీనియర్ నని..హోదాపరంగా కూడా తాను టీపీసీసీ ఫుల్ టైమ్ ప్రెసిడెంట్ ను అన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే ఆరో వేలుతో సమానం అని వ్యాఖ్యానించారు. ఏజెండా కెటీఆర్ ఫిక్స్ చేసినా..ఏ అంశం అయినా తానే చర్చకు వస్తానన్నారు. నవంబర్ 15లోగా తన సవాల్ కు రెడీ కావాలన్నారు. కాంగ్రెస్ లో సీనియర్ నేతల గురించి కెటీఆర్ కు ఎందుకు అని ప్రశ్నించారు. భట్టికితోడు కెటీఆర్ ను కూడా రమ్మనండి అంటూ సవాల్ విసిరారు. అయ్యా, కొడుకులకు చెప్పాల్సిన గుణపాఠం తెలంగాణ ప్రజలు చెప్పటానికి సిద్ధంగా ఉన్నారన్నారు.
లింగోజిగూడ ఎన్నికలో టీఆర్ఎస్, బిజెపి కలిసొచ్చినా మూసీలో తొక్కామన్నారు. రాజకీయమా, ఎన్నికలా లేక డెవలప్ మెంటా ఏ అంశంపై కెటీఆర్ చర్చకు సిద్ధమో చెప్పాలని సవాల్ విసిరారు. దేశంలో దళితులను అత్యంత దారుణంగా మోసం చేసిన ఏకైక వ్యక్తి కెసీఆర్ మాత్రమే అన్నారు. దళిత బంధు పాత పథకమే అయితే ఆపితే అధికార టీఆర్ఎస్ ఎందుకు మౌనంగా ఉందని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. దళితులను కెసీఆర్ కేవలం ఓటేసే యంత్రాలుగా చూస్తారు తప్ప..ఆయనకు వారిపై ఎలాంటి ప్రేమలేదన్నారు. ఈ విషయం గతంలో ఎన్నోసార్లు నిరూపితం అయిందన్నారు. టీఆర్ఎస్ ప్రెసిడెంట్ గా కెసీఆర్ తరపున నామినేషన్లు దాఖలు చేసిన సమయంలో ఒక్క దళిత నేత కూడా లేరని వ్యాఖ్యానించారు.