సిద్ధిపేట‌లో ద‌ళిత‌బంధు ఇప్పించారా?

Update: 2021-10-24 06:38 GMT

జీడీపీ పెంచుతామ‌ని...గ్యాస్, డీజీల్, పెట్రోల్ రేట్లు పెంచుతున్నారు

రేవంత్ రెడ్డి విమ‌ర్శ‌లు

టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కేంద్రంలోని మోడీ స‌ర్కారు, తెలంగాణ స‌ర్కారుపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. మోడీ జీడీపీ పెంచుతామ‌ని అధికారంలోకి వ‌చ్చి గ్యాస్, పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచుకుంటూ పోతున్నార‌ని ఎద్దేవా చేశారు. బిజెపి ఏమి చేసింద‌ని హుజూరాబాద్ లో ఆ పార్టీకి ఓట్లు వేయ‌ల‌ని రేవంత్ రెడ్డి ప్ర‌శ్నించారు. ఉద్యమాల గడ్డ తెలంగాణను టీఆర్ఎస్ ప్రభుత్వం తాగుబోతులకు అడ్డాగా మార్చిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. హుజురాబాద్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా ఆయన ఇక్కడ మాట్లాడుతూ టీఆర్ఎస్ నేతలు నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాతున్నార‌ని, నిజాం నవాబు దారుల్లో సీఎం కేసీఆర్ నడుస్తున్నారని ఆరోపించారు. బీజేపీ రైతు వ్యతిరేక ప్రభుత్వమని రేవంత్‌రెడ్డి విమర్శించారు. టీఆర్ఎస్, బీజేపీ తెలంగాణ రాష్ట్ర పరువును దిగజారుస్తున్నాయన్నారు. బీజేపీ, టీఆర్ఎస్‌కు ఎందుకు ఓటెయ్యాలో ప్రజలు ఆలోచించాలన్నారు. త్వరలో టీఆర్ఎస్, బీజేపీలకు ప్రజలు తగిన బుద్ధి చెప్తారని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

బ‌ల్మూర్ వెంక‌ట్ హుజూరాబాద్ కు స్థానికేత‌రుడు అన‌టంపై ఆయ‌న స్పందించారు. సీఎం కెసీఆర్, మంత్రులు హ‌రీష్ రావు, కెటీఆర్ లు కూడా త‌మ నియోజ‌క‌వ‌ర్గాల‌కు అనామ‌కులే అని విమ‌ర్శించారు. పంప‌కాల్లో తేడాతోనే హుజూరాబాద్ ఉప ఎన్నిక వ‌చ్చింద‌ని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ఆదివారం నాడు హూజూరాబాద్ లో పార్టీ నేత‌లు మ‌ల్లు ర‌వి, పొన్నం ప్ర‌భాక‌ర్ ల‌తో క‌ల‌సి మీడియా స‌మావేశంలో మాట్లాడారు. హుజూరాబాద్ లో పోలీసుల‌ను నిజాయ‌తీగా ప‌నిచేసుకోనివ్వ‌టం లేద‌ని విమ‌ర్శించారు. భ‌య‌పెట్టి ఓట్లు పొందేందుకు హ‌రీష్ రావు అన్ని ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని ఆరోపించారు. సిద్ధిపేట‌లో ద‌ళిత‌బంధు ఇప్పించారా? దుబ్బాక‌, నాగార్జున‌సాగ‌ర్ లో ఇచ్చిన హామీలు ఏమ‌య్యాయ‌ని ప్ర‌శ్నించారు.

Tags:    

Similar News