పెగాసెస్ వ్య‌వ‌హారం..అమిత్ షా రాజీనామాకు విప‌క్ష పార్టీల‌ డిమాండ్

Update: 2021-07-23 06:18 GMT

లోక్ స‌భ‌ను పెగాసెస్ స్పైవేర్ వ్య‌వహారం శుక్ర‌వారం నాడు కూడా కుదిపేసింది. కాంగ్రెస్ తోపాటు డీఎంకె, శివ‌సేన ఎంపీలు ట్యాపింగ్ పై చ‌ర్చ‌కు డిమాండ్ చేశారు. ఇదే అంశంపై విప‌క్ష పార్టీలు స‌భ‌లో ఆందోళ‌న‌కు దిగాయి. వెల్ లోకి వెళ్ళి నినాదాలు చేశారు. స‌భ వెలుప‌ల కూడా ఈ పార్టీల ఎంపీలు గాంధీ విగ్ర‌హం వ‌ద్ద నిర‌స‌న‌కు దిగారు. ఈ సంద‌ర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం పెగాసెస్ స్పైవేర్ ను ఉప‌యోగించార‌ని విమ‌ర్శించారు. దీనికి బాధ్య‌త వ‌హిస్తూ హోం మంత్రి అమిత్ షా రాజీనామా చేయాల‌న్నారు.

జ్యుడిషియ‌ల్ విచార‌ణ‌కు ఆదేశించాల‌ని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. మోడీ, అమిత్ షాలు దేశానికి వ్య‌తిరేకంగా పెగాసెస్ ను వాడార‌ని ఆరోపించారు. పెగాసెస్ ను క‌ర్ణాట‌క‌లోనూ..వ్య‌వ‌స్థ‌ల‌ను ధ్వంసం చేసేందుకు వాడార‌ని తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. నా ఫోన్ కూడా ట్యాప్ చేశారు. ఇది రాహుల్ గాంధీ వ్య‌క్తిగ‌త అంశం కాద‌ని..తాను ప్ర‌తిప‌క్ష నేత‌గా ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను లేవ‌నెత్తుతున్నామ‌ని తెలిపారు. రాఫెల్ స్కామ్ గురించి మాట్లాడినందుకే త‌న ఫోన్లు ట్యాప్ చేశార‌ని ఆరోపించారు. ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీనే ఈ అంశానికి బాధ్య‌త వ‌హించాల‌ని కోరారు.

Tags:    

Similar News