ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై సీనియర్ మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇచ్చిన సభా హక్కుల ఉల్లంఘన అంశంపై ప్రివిలైజ్ కమిటీ తొలి భేటీ మంగళవారం నాడు జరిగింది. అయితే ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా మరోసారి భేటీ అవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. వర్చువల్‌గా అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ భేటీ అయ్యింది. చైర్మన్ కాకాణి గోవర్ధన్ రెడ్డి నేతృత్వంలో ప్రివిలేజ్ కమిటీ సమావేశం జరిగింది. తనకు వచ్చిన ఫిర్యాదును ప్రివిలేజ్ కమిటీకి స్పీకర్ తమ్మినేని సీతారాం పంపించారు.
అసెంబ్లీలోని రూల్ నెం 212, 213 కింద ఎస్‌ఈసీని పిలింపించవచ్చని సభ్యులు తెలిపారు. గతంలో మహారాష్ట్రలో కూడా ఇలానే చేశారని ప్రివిలేజ్ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఆర్టికల్ 243 ప్రకారం ఎస్‌ఈసీకి సర్వాధికారాలు ఉన్నాయని, అలాంటప్పుడు ఎలా పిలిపిస్తారని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ అభ్యంతరం లేవనెత్తారు. మరో వారంలో ఆన్‌లైన్‌లో కాకుండా నేరుగా సమావేశం కావాలని కమిటీ నిర్ణయం తీసుకుంది. అయితే న్యాయనిపుణులతోపాటు అన్ని రకాల అభిప్రాయాలను తీసుకుని ముందుకెళ్ళాలని నిర్ణయించినట్లు సమాచారం.