వ‌చ్చే 25 సంవ‌త్స‌రాలే ల‌క్ష్యంగా ముందుకు

Update: 2022-01-31 08:02 GMT

రాష్ట్ర‌ప‌తి రామ్ నాథ్ కోవింద్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. బ‌డ్జెట్ స‌మావేశాల ప్రారంభం సంద‌ర్భంగా ఆయ‌న ఉభ‌య‌స‌భ‌ల‌నుద్దేశించి మాట్లాడారు. వ‌చ్చే 25 సంవ‌త్స‌రాలు దేశ పునాదులు మ‌రింత ప‌టిష్టంగా మారేందుకు అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు చేప‌డుతున్న‌ట్లు పేర్కొన్నారు. దేశ ప్ర‌జ‌లు అంద‌రికీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ 'స్వాతంత్ర్య అమృతోత్సవ్' శుభాకాంక్షలు తెలియజేశారు. కరోనా మహమ్మారిపై భారత్ పోరాటం స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు. 'సబ్‌ కా సాత్ సబ్‌ కా వికాస్' మూలసూత్రంతో ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. పేద ప్రజలకు గూడు కల్పించే హక్కును సాకారం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, ఏ ఒక్కరూ ఆకలితో నిద్రపోకూడదనే సంకల్పంతో ముందుకు వెళుతోంద‌ని అన్నారు. దేశంలోని రైతులందరికీ సాధికారత కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్రపతి కొనియాడారు. కీలక విధానాల్లో రైతులు, చిన్నరైతులకు అండగా ప్రభుత్వం ఉంటుందని భరోసా ఇచ్చారు. రైతుల ఆదాయం పెరిగేందుకు పలు చర్యలు తీసుకుందని చెప్పారు.

దేశ వ్యవసాయ ఎగుమతులు రూ.2 లక్షల కోట్లు దాటాయని చెప్పారు. 2020-21 కోవిడ్ మహమ్మారి సమయంలోనూ 30 కోట్ల టన్నుల ఆహారధాన్యాలు పండించారని, 33 కోట్ల హార్టీకల్చర్ ఉత్పత్తులు సాధించారని చెప్పారు. ప్రభుత్వం 433 లక్షల మెట్రిక్ టన్నుల గోదువులు సేకరించిందని, దీంతో 50 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరిందని చెప్పారు. కేవలం ఏడాది కంటే తక్కువ వ్యవధిలోనే 150 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్ డోసులు తీసుకోవడం రికార్డు అని చెప్పారు. 70 శాతం మంది లబ్ధిదారులు రెండో డోసు కూడా తీసుకున్నారని చెప్పారు.

వ్యాక్సిన్‌తో కోట్లాది మంది ప్రజల ప్రాణాలు కాపాడగలిగామని అన్నారు. ఫార్మారంగానికి ప్రభుత్వం దన్నుగా నిలుస్తోందని చెప్పారు. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాల ద్వారా ఫార్మారంగం అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. ఆయుర్వదం, దేశవాళీ చికిత్స వంటివి కూడా ప్రభుత్వ పథకాలంతో లబ్ధి పొందుతున్నాయని చెప్పారు. పేద ప్రజల హెల్త్‌కేర్‌కు ఆయుష్మాన్ భారత్, ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన ఎంతగానో ఉపయోగపడుతున్నాయని తెలిపారు. భవిష్యత్తులో ఎలాంటి హెల్త్‌కేర్ సంక్షోభాన్నైనా నివారించేందుకు రూ.64,000 కోట్లతో ఆయుష్మాన్ భారత్ హెల్త్‌కేర్ ఇన్‌ఫ్రాస్టక్చర్ మిషన్ సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు.

Tags:    

Similar News