కేంద్ర మాజీ మంత్రి, బిజెపి సీనియర్ నేత ప్రకాష్ జవదేకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో చాలా మంది నేతలు బెయిల్ పై ఉన్నారని..వాళ్లు త్వరలోనే జైలుకు వెళతారని వ్యాఖ్యానించారు. ఏపీ ప్రభుత్వ తీరుపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం నుంచి ఎర్రచందనం స్మగ్లింగ్ సాగుతోందని మండిపడ్డారు. దీనిపై ఏర్పాటు చేసిన సిట్ ను కూడా రద్దు చేశారన్నారు. ప్రభుత్వం మాత్రం చూసీచూడనట్లు వదిలేస్తోందని ధ్వజమెత్తారు. ఏపీలో విధ్వంసకర పాలన సాగుతోందని మండిపడ్డారు. ఏపీ బిజెపి మంగళవారం నాడు ప్రజాగ్రహ సభ లో ఆయన మాట్లాడారు. వైసీపీ, టీడీపీ, టీఆర్ఎస్ పార్టీలు కుటుంబ పార్టీలే అని విమర్శించారు. ఏపీలో టీడీపీ, వైసీపీ రెండూ ప్రజలను దారుణంగా మోసం చేశాయని విమర్శించారు.
సీఎం జగన్ తాను అధికారంలోకి వస్తే మధ్యనిషేధం అమలు చేస్తామని చెప్పారని..కానీ మద్యం ద్వారా వచ్చే డబ్బుతోనే ప్రభుత్వాన్ని నడుపుతున్నారని ఎద్దేవా చేశారు.జగన్ ఇచ్చిన హామీలు అమలు చేయకుండా..కేంద్ర పథకాలకు ఆయన స్టిక్కర్లు వేసుకుంటున్నారని మండిపడ్డారు. తన హయాంలోనే పోలవరానికి అనుమతులు వచ్చాయని..అనుమతులు ఇచ్చి ఏడేళ్‌లు అయినా ఇప్పటివరకూ ప్రాజెక్టును పూర్తి చేయలేదని ప్రకాష్ జవదేకర్ తప్పుపట్టారు. రాష్ట్రానికి మేలు చేసే పార్టీ బిజెపినే అని..వచ్చే ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. బిజెపి బహిరంగ సభలో మాట్లాడిన నేతలు అందరూ వైసీపీ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు గుప్పించారు. అయితే జవదేకర్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.