ఆసక్తికరం. ఢిల్లీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. గత కొన్ని రోజులుగా దేశంలోని కీలక నేతలు అందరితో భేటీ అవుతున్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మంగళవారం నాడు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో సమావేశం అయ్యారు. అయితే ఈ సమావేశం ఏజెండా ఏమిటనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. కొద్ది రోజుల వ్యవధిలోనే ప్రశాంత్ కిషోర్ సీనియర్ నేత శరద్ పవార్ తో సమావేశం అయి పలు అంశాలు చర్చించిన సంగతి తెలిసింది.
ఇప్పుడు రాహుల్ గాంధీతో సమావేశం కావటంతో ఈ భేటీ వెనక ఏజెండా ఏమి అయి ఉంటుందనే అంశంపై ఆసక్తికర చర్చలు సాగుతున్నాయి. ఈ సమావేశంలో ప్రియాంక గాంధీతోపాటు పలువురు సీనియర్ నేతలు కూడా పాల్గొన్నట్లు సమాచారం. అయితే కొన్ని జాతీయ ఛానళ్లు మాత్రం పంజాబ్ లో నెలకొన్న పరిస్థితులపై చర్చించేందుకే ఈ సమావేశం అని చెబుతున్నాయి. పంజాబ్ లోని కాంగ్రెస్ సీఎం అమరీందర్ సింగ్ కు ఆయన సలహాదారుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.