
కరోనా కట్టడిలో కేంద్రం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. అంతే కాదు..వ్యాక్సిన్ విషయంలో కూడా పలు రాష్ట్రాలు...మరో వైపు సుప్రీంకోర్టు కూడా కేంద్ర విధానాన్ని తప్పుపడుతూ పరుష వ్యాఖ్యలు చేస్తోంది. కేంద్రానికి వ్యాక్సిన్ల విషయంలో అసలు ప్రణాళికే లేదని..అందుకే ఇప్పుడు తీవ్ర సమస్యను ఎదుర్కోవాల్సి వస్తోందని విమర్శిస్తున్నారు. అయితే సానుకూల పరిణామం ఏమిటంటే దేశ వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా కరోనా కేసులు క్రమంగా తగ్గుపడుతూ వస్తున్నాయి. దీంతో పలు రాష్ట్రాలు అన్ లాక్ ప్రక్రియకు శ్రీకారం చుట్టాయి. అయితే ఐసీఎంఆర్ మాత్రం తొందరపడి లాక్ డౌన్లు ఎత్తేయవద్దని..ముప్పు ఇంకా తొలగిపోలేదని హెచ్చరిస్తోంది.
అయితే రాష్ట్రాల్లో తగ్గిన కేసులు..ఆర్ధిక పరిస్థితులను గమనంలోకి తీసుకుని ఎవరికి వారు నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. కరోనా సెకండ్ వేవ్ లో లాక్ డౌన్ విషయాలను కేంద్రం రాష్ట్రాలకే వదిలేసింది. ఇప్పుడు అందుకే అన్ లాక్ విషయంలో కూడా ఎవరికి వారు వెసులుబాట్లు కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ తరుణంలో ప్రధాని మోడీ సోమవారం సాయంత్రం ఐదు గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇప్పుడు మోడీ ఏమి చెబుతారు అన్న ఆసక్తి అందరిలో నెలకొంది.