వైసీపీ అనాలోచిత విధానాలతో విద్యుత్ సంక్షోభం

Update: 2022-04-08 11:54 GMT

వైసీపీ ప్ర‌భుత్వంపై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ మండిప‌డ్డారు. రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభానికి వైసీపీ అనాలోచిత విధానాలే కారణం అని ఆరోపించారు. పల్లెల్లో 14 గంటలు, పట్టణాల్లో 8 గంటలకు తగ్గకుండా విద్యుత్ కోతలతో ప‌జ‌లు తీవ్ర స‌మస్య‌లు ఎదుర్కొంటున్నార‌ని తెలిపారు. అనధికార విద్యుత్ కోతలతో ప్రజలు అల్లాడిపోతున్నారని, మొబైల్ ఫోన్ వెలుతురులో ప్రసవాలు రాష్ట్రంలో దుస్థితిని తెలియచేస్తున్నాయని వ్యాఖ్యానించారు. పవర్ హాలిడే ప్రకటనతో పారిశ్రామిక అభివృద్ధికి విఘాతం క‌లుగుతుంద‌ని. దీని వ‌ల్ల 36 లక్షల మంది కార్మికుల ఉపాధికి దూరం అయ్యే ప్రమాదం ఉంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. అదే స‌మ‌యంలో సీఎం జ‌గ‌న్ తాజాగా జ‌న‌సేన‌పై చేసిన విమ‌ర్శ‌ల‌పై కూడా ప‌వ‌న్ స్పందించారు. వ్యక్తిగత అజెండాతో జనసేన పార్టీని స్థాపించలేదని, ప్రజలు బాగుండాలి, వారిని పల్లకీ ఎక్కించాలనే ఉద్దేశంతోనే పార్టీని ప్రారంభించాన‌ని తెలిపారు. 'భవన నిర్మాణ కార్మికుల సమస్యల నుంచి పెరిగిన విద్యుత్ ఛార్జీల వరకు ప్రజల పక్షానే పోరాటం చేస్తున్నాం. ఉద్యోగులు రోడ్డెక్కడానికి, కౌలు రైతుల ఆత్మహత్యలకు కారణం మేము కాదు.. మీ విధానాలే.

                                            మేము ప్రభుత్వ విధానాలు, పాలసీల గురించి మాట్లాడితే నన్ను వ్యక్తిగతంగా రాక్షసుడు, దుర్మార్గుడు అని దూషిస్తున్నారు. మీరు వ్యక్తిగతంగా దూషణలకు దిగితే వాటిని ఎలా ఎదుర్కోవాలో నాకు బాగా తెలుసు. మీరు నోటికి వచ్చినట్లు మాట్లాడి మా సహనాన్ని పరీక్షించ వద్దు. పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ల రద్దు నుంచి పరిశ్రమలకు పవర్ హాలీడే ప్రకటించే వరకు వైసీపీ అనాలోచిత విధానాలతో ప్రజలను ఎలా మోసం చేస్తున్నారో ప్రతి ఒక్క జన సైనికుడు, వీరమహిళ ప్రజల్లోకి తీసుకెళ్లాలి"అన్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ శుక్రవారం హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విద్యుత్ సంక్షోభంపై మాట్లాడారు. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఉండేది. దీంతో 2014 – 19 సమయంలో అప్పటి ప్రభుత్వ హయాంలో విద్యుత్ కోతల ప్రభావం పెద్దగా ఉండేది కాదు. ఒకటి రెండు సందర్భాలలో విద్యుత్ ఛార్జీలు పెంచినపుడు కడియం ప్రాంత రైతులు తన వద్దకు వచ్చి భారం మోయలేమంటూ గోడు వెళ్లబోసుకున్నారు. నేను ప్రభుత్వం దృష్టికి ప్రజల తరఫున ఈ విషయం తీసుకెళ్లినప్పుడు పెంచిన ఛార్జీలను ఉపసంహరించుకున్నారు.

                                 వైసీపీ అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వం చేసుకున్న పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు (పి.పి.ఎ.) రద్దు చేసింది. యూనిట్ రూ. 4.80 చొప్పున 25 ఏళ్ల పాటు గ్రీన్ ఎనర్జీ కంపెనీలతో అప్పటి ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసింది. యూనిట్ రెండు రూపాయలకే గ్రీన్ ఎనర్జీని తీసుకొస్తామని చెప్పింది. ఇప్పుడేమో కోల్ ఎనర్జీని రూ.20 పెట్టి కొంటోంది. ఇలాంటి లోపభూయిష్ట నిర్ణయాల వల్లే విద్యుత్ సంక్షోభం ఏర్పడిందని మండిప‌డ్డారు. విద్యార్థులు, పరీక్షలకు సన్నద్దమవుతున్న వారు కరెంట్ కోతలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పగలంతా తరగతి గదుల్లో ఉండి రాత్రిళ్లు ప్రశాంత నిద్ర లేక ఒత్తిడికి గురవుతున్నారు. ఇళ్లల్లో కరెంటు లేకపోవడంతో కొందరు రైల్వే స్టేషన్, బస్టాండుల్లో పడుకుంటున్నారు. పరిశ్రమలకు ఇప్పటికే వారాంతంలో ఒక రోజంతా విద్యుత్ కోతలు అమలు చేస్తున్నారు. తాజాగా మరో రోజు పవర్ హాలిడే ప్రకటించడంతో పరిశ్రమలు వారానికి రెండు రోజులు మూతపడనున్నాయి. అలాగే నిరంతరం పని చేసే పరిశ్రమలు ఇప్పుడు వాడుతున్న కరెంట్ లో ఇక 50 శాతం మాత్రమే వాడాలనే నిబంధన విధించింది. దీంతో కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టిన పారిశ్రామికవేత్తలు విద్యుత్ కోతలతో నష్టాల పాలవుతున్నారు. పారిశ్రామిక అభివృద్ధికి విఘాతం కలుగుతుందని తెలిపారు.

Tags:    

Similar News