లక్షల కుటుంబాలను కరోనా ముప్పులోకి నెడతారా?

Update: 2021-04-20 11:09 GMT

ఏపీ సర్కారుపై పవన్ కళ్యాణ్ ఫైర్

షెడ్యూల్ ప్రకారమే ఏపీలో పదవ తరగతి పరీక్షలు నిర్వహించాలన్న సర్కారు నిర్ణయాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తప్పుపట్టారు. ఇది లక్షల మంది విద్యార్ధులను, వారి కుటుంబాలను కరోనా ముప్పలోకి నెట్టడమే అని మండిపడ్డారు. సీబీఎస్ఈ కూడా పరీక్షలు రద్దు చేసిందని..దేశంలో ఎవరికీ లేని రీతిలో ఒక్క ఏపీ సర్కారుకే మిలటరీ నియామకాల ఇబ్బంది వచ్చిందా? అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. కరోనా సెకండ్ వేవ్ వల్ల నిత్యం వేల సంఖ్యలో కేసులు నమోదవుతుంటే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తాను చెప్పిన షెడ్యూల్ ప్రకారమే 10వ తరగతి, ఇంటర్మీడియెట్ పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించడం ప్రభుత్వ మూర్ఖత్వ పోకడ అని అర్థం అవుతోందని విమర్శించారు.

పదో తరగతికి 6.4 లక్షల మంది, ఇంటర్మీడియెట్ కు 10.5 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. అంటే సుమారుగా 16.5 లక్షల మందిని, వారి కుటుంబాలను ప్రభుత్వం నేరుగా కరోనా ముప్పులోకి గెంటి వేస్తున్నట్లే. ఆ విద్యార్థుల కుటుంబాల్లో 45ఏళ్ళు పైబడినవారు, వృద్ధులు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఉంటారు. వారందరినీ కరోనా చుట్టుముడితే బాధ్యత ఎవరు తీసుకుంటారు? అని ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాల్లో చేస్తున్న తరహాలోనే ఏపీలో కూడా పై తరగతులకు విద్యార్ధులను ప్రమోట్ చేయాలన్నారు.

Tags:    

Similar News