విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు మొక్కుబడి పత్రికా ప్రకటనలు..పాదయాత్రలు కాకుండా నిర్ధిష్టమైన ప్రణాళిక రచించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఈ అంశంపై చర్చించేందుకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టాలన్నారు. జీవీఎంసీ ఎన్నికల్లో గెలుపు ద్వారా అధికార వైసీపీపై ఈ ప్లాంట్ కాపాడాల్సిన బాధ్యత మరింత పెరిగిందని వ్యాఖ్యానించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో వైసీపీ తన చిత్తశుధ్ధిని నిరూపించుకోవాలన్నారు. తాజాగా ముగిసిన మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీది సంపూర్ణ విజయం కాదని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. పంచాయతీ ఎన్నికల మాదిరి ఎన్నికల కమిషన్ ప్రభావవంతంగా పని చేయలేదన్నారు. మీకు నిజంగా చిత్తశుద్ది ఉంటే, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేలు జరగాలని భావిస్తే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి.
మీరు అలా చేసిన రోజున తమ వంతు సహకారం అందిస్తామన్నారు. ఇప్పటికే తాము ఈ అంశంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు వినతిపత్రం ఇచ్చామన్నారు. 'మీకు 22 మంది ఎంపీలు ఉన్నారు. స్టీల్ ప్లాంట్ వ్యవహారాన్ని వైసీపీ బలంగా ముందుకు తీసుకువెళ్లాలి. సమస్యను ఢిల్లీలోనే పరిష్కరించాలి. ఎండల్లో మాడిపోతున్న కార్మికుల కుటుంబాలకు భరోసా ఇవ్వాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు, వారి కుటుంబాలకు జనసేన పార్టీ తరఫున మేము అండగా ఉంటాం. మీరు ఒత్తిడి తీసుకురావాల్సింది వైసీపీపైనే. కార్పోరేషన్ ఎన్నికల్లో మెజారిటీ ఓట్లు సాధించిన వైసీపీపై ఒత్తిడి తీసుకురావాలని కార్మిక సంఘాలను కోరుతున్నాం.' అన్నారు.