సీఎం కెసీఆర్, ఈటెల రాజేందర్..గెల్లు శ్రీనివాస్. ముగ్గురూ ఒక్క చోట ఉంటే. ఇప్పుడు సాధ్యం కాకపోవచ్చు. కాకపోతే ఒకప్పుడూ అందరూ ఒక పార్టీ వారే. కానీ మారిన పరిస్థితుల్లో ఈటెల రాజేందర్ ను చకచకా మంత్రివర్గం నుంచి తప్పించారు. ఆ తర్వాత ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే హుజూరాబాద్ లో ఉప ఎన్నిక వ్యవహారం షెడ్యూల్ రాకపోయినా హోరెత్తుతోంది. ఈ తరుణంలో కెసీఆర్, ఈటెల, గెల్లు శ్రీనివాస్ ముగ్గురూ కలసి ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈటెల రాజేందర్ కు ఒకప్పుడు అనుచరుడుగా ఉన్న గెల్లు శ్రీనివాసే ఇప్పుడు ఈటెల రాజేందర్ ప్రత్యర్ధిగా మారి బరిలో నిలిచిన విషయం తెలిసిందే. రాజకీయాల్లో ఏదైనా సాధ్యం అనటానికి ఇదో ఉదాహరణ.
అయితే గెల్లు శ్రీనివాసయాదవ్ ఎక్కడా స్వతంత్రంగా ప్రచారం చేయటం కన్నా మంత్రి హరీష్ రావు నిర్వహించే ప్రచార సభల్లో మాత్రం ఓటర్లకు దండం పెడుతూ ఉన్న ఫోటోలే ఎక్కువ కన్పిస్తున్నాయి. అయితే స్థానికంగా అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈటెల రాజేందర్ ముందు గెల్లు శ్రీనివాసయాదవ్ అభ్యర్ధిగా చాలా లైట్ వెయిట్ అని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే అతని బలం అంతా అధికార టీఆర్ఎస్ పార్టీ, దళిత బంధు, మంత్రులు..ఎమ్మెల్యేల ప్రచారం మాత్రమే. అదే సమయంలో హుజూరాబాద్ లో బిజెపి బలం కంటే..ఈటెల రాజేందర్ బలమే ఎక్కువ.